Updated : 09/07/2021 09:29 IST

INDvsSL: బంతులేస్తే వికెట్లు పడాల్సిందే!  

భారత్ X శ్రీలంక జట్ల మధ్య అత్యధిక వికెట్ల వీరులు..

టీమ్‌ఇండియా, శ్రీలంక జట్లు మరికొద్ది రోజుల్లో పరిమిత ఓవర్ల సిరీసులు ఆడేందుకు సిద్ధపడుతున్నాయి. దాంతో ఆటగాళ్లంతా కఠినమైన బయోబుడగలో ఉంటూ తమ సాధన కొనసాగిస్తున్నారు. భారత జట్టు యువ ఆటగాళ్లతో కళకళలాడుతుండగా లంక తమ అనుభవజ్ఞులతో బరిలోకి దిగనుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్‌ఇండియా ఫేవరెట్‌గా కనిపిస్తున్నా సొంత గడ్డపై లంకను తక్కువ అంచనా వేయకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్‌ఇండియా విజయం సాధించాలంటే బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లూ రాణించాలి. అలా ఇరు జట్ల మధ్య ఇదివరకు చెలరేగి మ్యాచ్‌ విన్నర్లుగా ఎదిగిన టాప్‌ బౌలర్ల గురించి మనమిప్పుడు తెలుసుకుందాం..


ముత్తయ్య ముందు..

క్రికెట్‌లో ముత్తయ్య మురళీధరన్‌ అంటే తెలియనివారుండరు. అతని స్పిన్‌ బౌలింగ్‌కు బోల్తాపడని జట్టుండదు! బ్యాటింగ్‌లో సచిన్‌ ఎలాగో బౌలింగ్‌లో ఈ శ్రీలంక మాజీ స్పిన్నర్‌ అలాగ. అంతర్జాతీయ క్రికెట్‌లో 800 వికెట్లు తీసి బౌలింగ్‌లో ఏకఛత్రాధిపతిగా నిలిచాడు. ఈ క్రమంలోనే స్పిన్‌ బౌలింగ్‌ను అలవోకగా ఆడే టీమ్‌ఇండియాను సైతం అతడు గడగడలాడించాడు. భారత్‌తో మొత్తం 63 మ్యాచ్‌లాడి 74 వికెట్లు సాధించాడు. దాంతో ఇరు జట్ల మధ్య అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో నిలిచాడు. టీమ్‌ఇండియాపై సగటు 31.78 కాగా, అత్యుత్తమ గణాంకాలు 7/30గా నమోదయ్యాయి.


చమిందా తర్వాత..

భారత్‌, శ్రీలంక జట్ల మధ్య మురళీధరన్‌ తర్వాత అంత గొప్ప గణంకాలు నమోదు చేసింది చమిందా వాస్‌. ఈ లంక మాజీ పేసర్‌ తనదైన బౌలింగ్‌తో ఎన్నో జట్లను ఒంటిచేత్తో చిత్తు చేశాడు. అతడు బౌలింగ్‌ చేయడానికి వస్తే ఏ బ్యాట్స్‌మన్‌ అయినా జాగ్రత్తపడాల్సిందే లేదా పరుగులు చెయ్యడానికి సాహసం చెయ్యాల్సిందే. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియాతో 61 మ్యాచ్‌లాడిన అతడు 70 వికెట్లు సాధించాడు. దాంతో ఇరు జట్ల మధ్య అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. భారత్‌పై అతడి సగటు 31.61గా నమోదవ్వగా అత్యుతమ గణాంకాలు 5/14గా నమోదయ్యాయి.


జహీర్‌‌‌ @ మూడు..

టీమ్‌ఇండియా పేస్‌ బౌలింగ్‌కే వన్నె తెచ్చిన బౌలర్‌ జహీర్‌ఖాన్‌. 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో అధికశాతం ప్రధాన బౌలర్‌గానే సేవలందించాడు. డెత్‌ ఓవర్ల స్పెషలిస్టుగా, ఓపెనర్లను బెంబేలెత్తించే బౌలర్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలోనే ఫాస్ట్‌ బౌలింగ్‌లో తనదైన ముద్ర వేశాడు. అలా శ్రీలంకతో ఆడిన 48 మ్యాచ్‌ల్లో జహీర్‌ 66 వికెట్లు సాధించాడు. దాంతో ఇరు జట్ల మధ్య అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. లంకపై అతడి సగటు 32.19గా నమోదవ్వగా, అత్యుత్తమ గణాంకాలు 5/42గా నమోదయ్యాయి.


భజ్జీ ఊరుకుంటాడా..

ఇక టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ సైతం లంకపై తన ప్రతాపం చూపించినవాడే. అతడి స్పిన్‌ మాయాజాలం గురించి అందరికీ తెలిసిందే. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ భారత జట్టుకు ఊరట కలిగించడంలో ముందు వరుసలో ఉంటాడు ఈ ఆఫ్‌స్పిన్నర్‌. అలా శ్రీలంకతో ఆడిన 47 మ్యాచ్‌ల్లో 61 వికెట్లు సాధించాడు. దాంతో జహీర్‌ తర్వాత టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా, మొత్తంగా నాలుగో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. లంకపై భజ్జీ సగటు 26.95గా నమోదవ్వగా, అత్యుత్తమ గణాంకాలు 5/56గా నమోదయ్యాయి.


అగార్కర్‌ సాధించాడుగా..

శ్రీలంకపై చెలరేగిన మరో టీమ్‌ఇండియా ఆణిముత్యం అజిత్‌ అగార్కర్‌. అతడు ప్రశాంతంగా కనిపిస్తూనే తనదైన దూకుడు చూపించాడు. తొమ్మిదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో లంకపై మొత్తం 25 మ్యాచ్‌లాడిన ముంబయి పేసర్‌ 49 వికెట్లతో చెలరేగాడు. దాంతో ఇరు జట్ల మధ్య అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. లంకపై అతడి సగటు 20.61గా నమోదవ్వగా, అత్యుత్తమ గణాంకాలు 5/44గా నమోదయ్యాయి.

* వీరిని గుర్తు చేసుకుంటే భారత యువ పేసర్లు సైతం రాబోయే సిరీసుల్లో రాణించే అవకాశం ఉంది. ఈ పర్యటనకు భువనేశ్వర్‌ ఒక్కడే అనుభవజ్ఞుడైన బౌలర్‌గా కనిపిస్తున్నాడు. మరోవైపు కుల్‌దీప్‌, చాహల్‌ వంటి స్పిన్నర్లున్నా లంకతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేదు. దాంతో వీరు కూడా గత ఛాంపియన్ల నుంచి స్ఫూర్తిపొంది ఈ పర్యటనలో రాణించాలని కోరుకుందాం.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని