tokyo olympics: ఒలింపిక్స్‌ చరిత్రలో అదో చీకటి రోజు!

ఒలింపిక్స్‌.. విశ్వక్రీడల మహోత్సవం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. శుక్రవారం నిర్వహించిన ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకలో హంగులు.. ఆర్భాటాలు.. కళాకారుల సందడితోపాటు కొన్ని నిమిషాలు మౌనం ఆవరించింది. ఎందుకో తెలుసా? తొలిసారిగా ఒలింపిక్స్‌ నిర్వాహకులు మరణించిన అథ్లెట్లకు శ్రద్ధాంజలి

Published : 26 Jul 2021 02:05 IST

శుక్రవారం ప్రారంభమైన ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకలో హంగులు.. ఆర్భాటాలు.. కళాకారుల సందడితోపాటు కొన్ని నిమిషాలు మౌనం ఆవరించింది. ఎందుకో తెలుసా? తొలిసారిగా ఒలింపిక్స్‌ నిర్వాహకులు మరణించిన అథ్లెట్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్యంగా ఒలింపిక్స్‌ చరిత్రలోనే చీకటి రోజుగా చెప్పుకునే మ్యూనిచ్‌-1972 ఘటనలో మృతి చెందిన 11 మంది ఇజ్రాయెల్‌ అథ్లెట్లకు నివాళులర్పించారు. ‘‘అమరులైన ఒలింపియన్స్‌ను ఒలింపిక్‌ కమ్యూనిటీ ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. ముఖ్యంగా ఒలింపిక్‌ క్రీడలు జరుగుతున్న సమయంలో ప్రాణాలు కోల్పోయిన అథ్లెట్లను’’అంటూ మ్యూనిచ్‌-1972 ఒలింపిక్స్‌ ఇజ్రాయెల్‌ అథ్లెట్లను నిర్వాహకులు గుర్తుచేసుకున్నారు. 49ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఇజ్రాయెల్‌ క్రీడాకారులకు సరైన గౌరవం దక్కిందని క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంతకీ అప్పుడేం జరిగింది?

నాలుగేళ్లకోసారి వచ్చే క్రీడల పండగ ఒలింపిక్స్‌కు 1972లో జర్మనీలోని మ్యూనిచ్‌ ఆతిథ్యమిచ్చింది. ప్రపంచదేశాల అథ్లెట్లంతా ఒలింపిక్స్‌ గ్రామానికి చేరుకొని పోటీల్లో పాల్గొంటున్నారు. ఆ రోజు సెప్టెంబర్‌ 5.. కేవలం అథ్లెట్లు ఇతర సిబ్బంది మాత్రమే ఉండే ఒలింపిక్స్‌ గ్రామంలోకి ఎనిమిది మంది ఉగ్రవాదులు చొరబడ్డారు. వారంతా పాలస్తీనాకు చెందిన బ్లాక్‌ సెప్టెంబర్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవారు. గ్రామంలోకి రావడంతోనే ఇజ్రాయెల్‌కు చెందిన 11 మంది సభ్యుల జట్టును అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు అథ్లెట్లను అక్కడికక్కడే కాల్చి చంపారు. మిగతా తొమ్మిది మంది అథ్లెట్లను బందీలుగా చేసుకొని.. 200 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

జర్మన్‌ పోలీసు బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నా.. అథ్లెట్లు ముష్కరుల చేతుల్లో బందీలుగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టలేకపోయారు. పైగా ఉగ్రవాదుల డిమాండ్లలో భాగంగా వారికి ప్రయాణ వెసులుబాటు కల్పించాల్సి వచ్చింది. దీంతో హెలికాప్టర్‌లో తొమ్మిది మంది అథ్లెట్లతోపాటు ఉగ్రవాదులు స్థానిక ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్‌కు జర్మన్‌ పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారు. డిమాండ్‌కు ప్రభుత్వం నిరాకరించడమే కాకుండా.. పోలీసులు కాల్పులు జరపడంతో బందీలుగా ఉన్న తొమ్మిది మంది అథ్లెట్లను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు.  దీంతో పోలీసులు కాల్పులు తీవ్రం చేయగా.. ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఓ జర్మన్‌ పోలీసులు మరణించాడు.

అయినా.. కొనసాగిన క్రీడలు

ఉగ్రవాదుల దాడితో కొన్ని గంటల పాటు క్రీడాపోటీలు నిలిచిపోయాయి. అథ్లెట్లు, పలువురు ఉగ్రవాదులు మృతి చెందడం.. మిగతా ఉగ్రవాదులు పోలీసులకు చిక్కడంతో పోటీలను కొనసాగించాలని అప్పటి అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ(ఐవోసీ) అధ్యక్షుడు ఎవెరీ బ్రండేజ్‌ నిర్ణయించారు. పలువురు పోటీలను నిలిపివేయాలని ఆందోళన చేపట్టినా.. ఒలింపిక్స్‌ నిర్వాహకులు పోటీల కొనసాగింపునకే మొగ్గుచూపారు. ఈ క్రమంలో ఒలింపిక్‌ స్టేడియంలోనే సంస్మరణ సభ ఏర్పాటు చేసి.. మృతులకు సంతాపం తెలియజేశారు. మొత్తంగా 34 గంటల విరామం తర్వాత పోటీలు తిరిగి ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఒలింపిక్‌ గ్రామానికి భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

గతంలో ఎన్నో విమర్శలు

మ్యూనిచ్‌ ఘటనలో మృతి చెందిన అథ్లెట్లకు ఆ తర్వాత జరిగే ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకల్లో నివాళులర్పించి.. వారికి తగిన గౌరవం ఇవ్వాలని మృతుల కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. కానీ, వారి విన్నపాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరికి ఆ దుర్ఘటన జరిగి 40ఏళ్లు పూర్తయిన సందర్భంగా కనీసం లండన్‌-2012 ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలోనైనా నివాళులర్పించమని విజ్ఞప్తి చేశారు. అందుకు కూడా ఐవోసీ నిరాకరించింది. ప్రారంభోత్సవ వేడుకల్లో శ్రద్ధాంజలి ఘటించడం సరికాదని అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో ఐవోసీపై విమర్శలు వెల్లువెత్తాయి. 2016 రియో ఒలింపిక్స్‌ సమయంలో అమరులైన అథ్లెట్లకు సంతాపం తెలిపేందుకు ఒలింపిక్స్‌ గ్రామంలో ప్రత్యేక చోటును ఏర్పాటు చేసింది. కానీ, అధికారికంగా సంతాపం తెలపలేదు. ఎట్టకేలకు ఈ టోక్యో ఒలింపిక్స్‌లో వారిని స్మరించుకొని శ్రద్ధాంజలి ఘటించడంతో మ్యూనిచ్‌ మృతుల కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్నాళ్లకు న్యాయం జరిగిందని హర్షిస్తున్నారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని