
నటరాజ్.. నువ్వో లెజెండ్: వార్నర్
ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియా యువపేసర్, నయా యార్కర్ కింగ్ నటరాజన్‌పై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘నట్టూ ఓ లెజెండ్, జెంటిల్‌మ్యాన్’ అని కొనియాడాడు. మైదానంలో, వెలుపలా అతడు ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడని అన్నాడు. ఐపీఎల్‌లో అతడికి సారథిగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. సన్‌రైజర్స్ తరఫున నటరాజన్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్.
‘‘నటరాజన్.. ఓ లెజెండ్. అతడితో కలిసి ఎంతో విలువైన సమయాన్ని గడిపాను. మైదానంలో, బయటా ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు. మా జట్టులో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అదృష్టవశాత్తూ నట్టూకు సారథిగా ఉన్నాను. అతడు నిజమైన జెంటిల్‌మ్యాన్. ఎంతో ప్రతిభ ఉన్న నట్టూ ఐపీఎల్-2020 సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత భారత జట్టుతో కలిసి నెట్ బౌలర్‌గా వెళ్లాడు. తొలిసారిగా తండ్రయిన అతడు.. తన కూతురుని చూడకుండా, త్యాగం చేస్తూ ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. గొప్ప ఘనత సాధించాడు’’ అని వార్నర్ తెలిపాడు.
‘‘నటరాజన్ విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లోనూ అతడు సత్తా చాటుతాడని ఆశిస్తున్నా. ఏ పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలో అతడికి తెలుసు. గత సీజన్‌లో దాదాపు 80 యార్కర్లను కచ్చితత్వంతో విసిరాడు. అతడు డెత్ ఓవర్లలో అసాధారణమైన తీరుతో బౌలింగ్ చేస్తాడు’’ అని వార్నర్ పేర్కొన్నాడు. నెట్‌బౌలర్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన నట్టూ అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకే పర్యటనలో అన్ని ఫార్మాట్లకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. అంతేకాక అంచనాలను మించి రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
అయితే ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చిన నటరాజన్‌కు ఘన స్వాగతం లభించింది. అతడి స్వస్థలం చిన్నప్పంపట్టిలో అభిమానులు నీరాజనాలు పలికారు. రథంపై ఊరేగిస్తూ సంబరాలు చేసుకున్నారు. దీనిపై వార్నర్ మాట్లాడుతూ.. ‘‘నట్టూకు లభించిన ఆ ఘన స్వాగతాన్ని చూశాను. ఎంతో ఆనందంగా ఉంది. అతడు సాధించిన ఘనతకు ఇది మంచి స్వాగతం’’ అని వార్నర్ అన్నాడు.
ఇవీ చదవండి