Neeraj Chopra: కోహ్లీ సమీపంలోకి గోల్డెన్‌ బాయ్‌..!

నీరజ్‌ చోప్రా.. ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ ఉన్న పేర్లలో ఇది. వందేళ్లపాటు భారత్‌ ఎదురు చూసిన అథ్లెటిక్స్‌ స్వర్ణాన్ని అందించిన గోల్డెన్‌బాయ్‌గా రికార్డ్‌ సృష్టించాడు. దీంతో నీరజ్‌ బ్రాండ్‌ విలువ

Published : 23 Sep 2021 01:45 IST

 దాదాపు 1000 శాతం పెరిగిన నీరజ్‌ బ్రాండ్‌ విలువ

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

నీరజ్‌ చోప్రా.. ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ ఉన్న పేరు ఇది. వందేళ్లపాటు భారత్‌ ఎదురు చూసిన అథ్లెటిక్స్‌ స్వర్ణాన్ని అందించిన గోల్డెన్‌బాయ్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో నీరజ్‌ బ్రాండ్‌ విలువ అమాంతం పెరిగిపోయింది.

ఆరడగుల అందగాడు.. ఆపై ప్రపంచ ఛాంపియన్‌.. భారతీయ యువతకు ఐకాన్‌..! ఇంకేముంది ఇప్పుడు నీరజ్‌ కోసం బ్రాండ్లు క్యూకడుతున్నాయి. అతడు ఒలింపిక్‌ స్వర్ణం గెలిచిన రోజునే ఇన్‌స్టాలో ఈ ఛాంపియన్ ఫాలోవర్ల సంఖ్య పదకొండు లక్షలు పెరిగింది. నెలరోజుల వ్యవధిలో నీరజ్‌ను అనుసరించేవారి సంఖ్య 46 లక్షలను దాటేసింది. బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌ ఫీజ్‌ 1000 శాతం పెరిగినట్లు వార్తలొస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో మెన్షన్స్‌ సునామీ..!

సోషల్‌ మీడియాలో నీరజ్‌ ఫాలోయింగ్‌పై ‘యూగోవ్‌ స్పోర్ట్స్‌’ అనే రీసెర్చ్‌ సంస్థ ఓ నివేదిక ఇచ్చింది. ఒలింపిక్స్‌ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచంలోనే అత్యధిక మెన్షన్స్‌ అందుకున్న క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా అని తేల్చింది. 14 లక్షల మంది ఆయన్ను 29లక్షల సార్లు మెన్షన్‌ చేశారు. పతకం రాక ముందు అతని మెన్షన్స్‌తో పోలిస్తే ఇది 1401 శాతం అధికం. ఇక ఆయన్ను మెన్షన్‌ చేసేవారి సంఖ్య 2055శాతం పెరిగింది.  సోషల్‌ , డిజిటల్‌ మీడియాలో అతడి రీచ్‌ ఏకంగా 41.2 కోట్లకు చేరింది. ఈ అంకెలు మొత్తం నీరజ్‌ చోప్రా సోషల్‌ మీడియా విలువను రూ.428 కోట్లకు చేర్చినట్లు ఆ సంస్థ తేల్చింది.

ఒలింపిక్‌ స్వర్ణం తర్వాత పాక్‌ క్రీడాకారుడు అర్షాద్‌ నదీమ్‌పై నీరజ్‌ అభిమానులు విమర్శలు కురిపించారు. ఈ సమయంలో నీరజ్‌ పరిణతి, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఓ వీడియోను పోస్టు చేశారు. దీంతో భారతీయుల్లో ఈ కుర్రాడిపై మరింత అభిమానం పెరిగింది.

గతంలో నీరజ్‌ వాణిజ్య ప్రకటనల పునఃసమీక్ష..!

నీరజ్‌ చోప్రా గోల్డ్‌ మెడల్‌ రాక ముందు కూడా కొన్ని కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించారు. అప్పట్లో ఆయన రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఛార్జ్‌ చేశారు. కానీ, ఇప్పుడు ఈ బల్లెం వీరుడి డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో గతంలో చేసుకొన్న ఒప్పందాల్లో మార్పులు చేసుకోనున్నారు. ఈ విషయాన్ని నీరజ్‌ బ్రాండ్‌ విషయాలు చూసుకొనే జెఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌ సీఈవో ముస్తఫా గౌస్‌ ఎకనామిక్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘‘అవి మల్టీ బిలియన్‌ డీల్స్‌.. పారిస్‌ ఒలింపిక్స్‌ వరకు కొనసాగనున్నాయి’’ అని వెల్లడించారు. 

మద్యం, పొగాకు ప్రకటనలకు దూరం..

నీరజ్‌ చోప్రా కేవలం డబ్బు మీదే దృష్టి పెట్టడం లేదు. సమాజంలో చెడు అలవాట్లను ప్రోత్సహించే వాటికి దూరంగా ఉండనున్నారు. ఆయన మద్యం, పొగాకు ఉత్పత్తుల ప్రకటనలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నట్లు సమాచారం. 

క్యూకట్టిన 80 సంస్థలు..

నీరజ్‌ బంగారు పతకం సాధించాక అతని కోసం పెద్ద పెద్ద కంపెనీలు క్యూకట్టాయి. 80 కంపెనీలు ఈ గోల్డెన్‌బాయ్‌ను ప్రచారకర్తగా నియమించుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు  జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌ వెల్లడించింది. కానీ, వచ్చే 12 నుంచి 14 నెలల్లో నీరజ్‌ దేశ విదేశాల్లో సాధన చేయనున్నారు. దీంతో కొన్ని రోజులు మాత్రమే వాణిజ్య ప్రకటనల చిత్రీకరణకు సమయం వెచ్చించే అవకాశం ఉంది. ఇప్పటికే నీరజ్‌ నైక్‌, గాటోరెడ్‌,ఎగ్జాన్‌ మొబిల్‌, మజిల్‌బ్లేజ్‌ వంటి కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్నాడు. ఒలింపిక్‌ విజయం తర్వాత బైజూస్‌,టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, మరో ఫార్మా కంపెనీతో ఒప్పందాలపై సంతకం చేశారు. మరోపక్క ఒక విలాసవంతమైన ఆటోమొబైల్‌, దుస్తుల బ్రాండ్లతో చర్చలు పురోగతిలో ఉన్నాయి.

పదిరెట్లు పెరిగిన ఫీజు..

నీరజ్‌ పతకం రాక ముందు ప్రచార కర్తగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన విలువ నాటితో పోలిస్తే కనీసం 10 రెట్లు పెరిగి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే రూ.కోటి నుంచి రూ.2.5 కోట్ల మధ్యకు నీరజ్‌ బ్రాండ్‌ విలువ చేరింది. ప్రస్తుతం భారత క్రీడాకారుల్లో  క్రికెటర్లు ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీలు మాత్రమే రూ. కోటి నుంచి రూ.5 కోట్ల వరకు ఛార్జ్‌ చేస్తున్నారు. ఇప్పుడు నీరజ్‌ ఒక్కసారిగా రూ.2.5 కోట్లకు చేరుకొన్నారు. భారత క్రికెటర్లలో రోహిత్‌ శర్మ, కె.ఎల్‌.రాహుల్‌ తీసుకుంటున్నదానికంటే ఈ మొత్తం చాలా ఎక్కువ. తాజాగా నీరజ్‌ తొలిసారి చేసిన క్రెడ్‌ యాప్‌ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని