సిరాజ్‌×ఇషాంత్‌: టీమ్‌ఇండియాకు తలనొప్పి!

ఇంగ్లాండ్‌ సిరీసుకు ముందు టీమ్‌ఇండియాకు మరోసారి తలనొప్పి ఎదురవుతోంది. ప్రధాన బౌలింగ్‌ దళం లేకపోవడంతో ఎవరిని ఎంపిక చేయాలో? తుదికూర్పు ఎలా ఉంటుందోనని జట్టు యాజమాన్యం తలపట్టుకొంది. రెండో పేసర్‌గా ఇషాంత్‌ శర్మకు మహ్మద్‌ సిరాజ్‌ గట్టిపోటీనిస్తున్నాడు....

Published : 02 Feb 2021 21:49 IST

దిల్లీ: ఇంగ్లాండ్‌ సిరీసుకు ముందు టీమ్‌ఇండియాకు మరోసారి తలనొప్పి ఎదురవుతోంది. ప్రధాన బౌలింగ్‌ దళం లేకపోవడంతో ఎవరిని ఎంపిక చేయాలో? తుదికూర్పు ఎలా ఉంటుందోనని జట్టు యాజమాన్యం తలపట్టుకొంది. రెండో పేసర్‌గా ఇషాంత్‌ శర్మకు మహ్మద్‌ సిరాజ్‌ గట్టిపోటీనిస్తున్నాడు. మంగళవారం టీమ్‌ఇండియా సాధన షురూ చేసింది. కాగా తొలి టెస్టుకు భారత్‌ ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో దిగే అవకాశం ఉంది.

‘సంప్రదాయ చెపాక్‌ పిచ్‌ ఇది. ఇంగ్లిష్‌ వాతావరణమేమీ ఉండదు. చెన్నై ఉక్కపోతలో వికెట్‌పై పచ్చిక అవసరం. అలాగైతే పిచ్‌పై పగుళ్లు రావు. ఎప్పటిలాగే పిచ్‌ స్పిన్నర్లకు సాయపడుతుంది’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా అందరి చూపు కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌పై ఉంది. పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రాకు తోడుగా ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ సిరాజ్‌లో వారు ఎవరిని ఎంపిక చేస్తారోనన్న ఆసక్తి నెలకొంది.

గాయం కారణంగా జస్ప్రీత్‌ బుమ్రా గబ్బా టెస్టులో ఆడని సంగతి తెలిసిందే. అతనిప్పుడు ఫిట్‌నెస్‌ సాధించాడు. ఇక గాయంతో ఆసీస్‌ సిరీసుకు దూరమైనా పూర్తిగా కోలుకున్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 14.1 ఓవర్లు విసిరాడు. అయితే గతేడాది అతడు ఒక్క టెస్టు మ్యాచూ ఆడలేదు. ఆసీస్‌ సిరీసులో సిరాజ్‌ దుమ్మురేపాడు. 13 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. బ్రిస్బేన్‌లో ఐదు వికెట్ల ఘనతా అందుకున్నాడు.

స్పిన్నర్ల విషయంలోనూ జట్టు యాజమాన్యానికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. నలుగురు స్పిన్నర్లలో ఎవరిని వదిలేయాలో తెలియడం లేదు. సొంతగడ్డ, అనుభవం రీత్యా అశ్విన్‌కు చోటు గ్యారంటీ. వాషింగ్టన్‌ సుందర్‌ బ్రిస్బేన్‌లో అదరగొట్టాడు. అటు అర్ధశతకం చేయడమే కాకుండా నాలుగు వికెట్లు తీశాడు. చెపాక్‌ పిచ్‌పై మంచి అనుభవం ఉంది. బ్యాటింగ్‌ సత్తా ఉన్న అక్షర్‌ పటేల్‌తో అతడికి పోటీ ఎదురవుతోంది. రవీంద్ర జడేజా స్థానంలో అతడిని ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదు. గత సిరీసులో చోటివ్వని చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ విషయంలో ఏం చేస్తారన్న సంగతి తెలియడం లేదు.

ఇవీ చదవండి
రిషభ్‌ పంత్‌ గుండెపోటు తెప్పించగలడు.. 
క్రికెట్‌ వదిలి గోల్ఫ్‌ ఆడుతున్న సచిన్‌, యువీ

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని