Ravi Shastri:ఎలాంటి పశ్చాత్తాపం  లేదు.. అక్కడే కరోనా సోకి ఉండొచ్చు:రవిశాస్త్రి

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు సమయంలో టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ ర‌విశాస్త్రికి కరోనా సోకిన విషయం తెలిసిందే. నాలుగో టెస్టుకు ముందు ఓ పుస్త‌కావిష్కరణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంతరం ర‌విశాస్త్రికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆ త‌ర్వాత రవిశాస్త్రితో ప్రైమరీ కాంటాక్ట్‌గా

Published : 19 Sep 2021 01:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు సమయంలో టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ ర‌విశాస్త్రికి కరోనా సోకిన విషయం తెలిసిందే. నాలుగో టెస్టుకు ముందు ఓ పుస్త‌కావిష్కరణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంతరం ర‌విశాస్త్రికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆ త‌ర్వాత రవిశాస్త్రితో ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న బౌలింగ్‌ కోచ్‌ భరత్ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ కూడా వైరస్ బారిన పడ్డారు. ఆపై ఇద్దరు ఫిజియోలకు కూడా కరోనా సోకింది.దీంతో భారత శిబిరంలో కరోనా రావడానికి రవిశాస్త్రియే ప్రధాన కారణమని పలు విమర్శలు వచ్చాయి.

ప్రస్తుతం రవిశాస్త్రి కొవిడ్ నుంచి కోలుకొని భారత్‌కు తిరిగి వచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు.ఈ సందర్భంగా రవిశాస్త్రి ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడాడు. పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంపై స్పందిస్తూ...‘ఆ కార్యక్రమంలో  నేను కలిసిన వ్యక్తులు బాగానే ఉన్నారు. అందుకే నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఆటగాళ్లు తమ గదుల్లో నిరంతరం ఉండటం కంటే.. బయటకు వెళ్లి వేర్వేరు వ్యక్తులను కలవడం మంచిది. ఓవల్ టెస్ట్‌కు 5000 మంది ప్రేక్షకులు వచ్చారు. తక్కువ మంది ఉన్న పుస్తకావిష్కరణకు వెళ్లిన నాపై వేలెత్తిచూపడానికి ఏమీ లేదు. ఈ  కార్య‌క్ర‌మానికి  దాదాపు 250 మంది హాజరయ్యారు. వారిలో ఎవరికీ వైరస్ సోకలేదు. కాబట్టి నేను భయపడలేదు’అని అన్నాడు.

ఒక్క పారాసిటామల్‌ మాత్ర కూడా వేసుకోలేదు

‘10 రోజులపాటు ఐసోలేష‌న్‌లో ఉన్నాను. ఆ ప‌ది రోజుల్లో నాకు ఎటువంటి ల‌క్ష‌ణాలు లేవు. కేవ‌లం గొంతు నొప్పి ఒక్క‌టే ఉంది. శరీర ఉష్ణోగ్రత అధికంగా  లేదు. ఒక్కసారి కూడా జ్వరం రాలేదు. నా ఆక్సిజ‌న్ స్థాయులు ఎప్పుడూ 99 శాతంగా ఉన్నాయి. ఐసోలేష‌న్‌లో ఉన్న ప‌ది రోజుల పాటు నేను మందులు వాడ‌లేదు. క‌నీసం ఒక్క పారాసిట‌మాల్ కూడా వేసుకోలేదు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

అక్కడే కరోనా సోకి ఉండొచ్చు

భారత శిబిరంలో కొవిడ్  సోకడానికి కారణం మీరేనా అని ప్రశ్నించగా..  'ఆగస్టు 31 పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. నాకు సెప్టెంబర్ 3న పాజిటివ్‌గా తేలింది. మూడు రోజుల వరకు వైరస్ లక్షణాలు బయటపడవు. కాబట్టి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నాకు వైరస్ సోకలేదు. లీడ్స్‌లోనే వైరస్ సోకి ఉండొచ్చు. ఇంగ్లాండ్‌ జులై 19న  కరోనా ఆంక్షలను సడలించింది. దీంతో హోటళ్లు, లిఫ్ట్‌లు అన్ని తెరుచుకున్నాయి.అప్పుడూ ఏమైనా జరిగి ఉండొచ్చు’అని బదులిచ్చాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని