పిచ్‌తో కాదు బ్యాటింగ్‌ వల్లే 2 రోజులు: కోహ్లీ

మొతేరా పిచ్‌ బాగానే ఉందని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. గులాబి టెస్టు రెండు రోజుల్లో ముగియడానికి రెండు జట్ల బ్యాట్స్‌మెన్‌ వైఫల్యమే కారణమని స్పష్టం చేశాడు. మరోవైపు నాణ్యమైన బౌలింగ్‌తో తాము ఓటమి పాలయ్యామని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ అంగీకరించాడు....

Published : 26 Feb 2021 01:13 IST

అహ్మదాబాద్‌: మొతేరా పిచ్‌ బాగానే ఉందని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. గులాబి టెస్టు రెండు రోజుల్లో ముగియడానికి రెండు జట్ల బ్యాట్స్‌మెన్‌ వైఫల్యమే కారణమని స్పష్టం చేశాడు. మరోవైపు నాణ్యమైన బౌలింగ్‌తో తాము ఓటమి పాలయ్యామని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ అంగీకరించాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు.

మొతేరా పిచ్‌ టెస్టు క్రికెట్‌కు సరిపోదన్న మైకేల్‌ వాన్‌, హర్భజన్‌ సింగ్‌ వంటి క్రికెటర్ల అభిప్రాయాల నేపథ్యంలో కోహ్లీ వివరణ ఇచ్చాడు. ‘నిజాయతీగా చెప్పాలంటే బ్యాటింగ్‌ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదు. మేం 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేశాం. అలాంటిది 150 కన్నా తక్కువకే ఆలౌటయ్యాం. ఏదో ఒక బంతి మాత్రమే అనూహ్యంగా టర్న్‌ అవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు పిచ్‌ బాగానే ఉంది. 30లో 21 వికెట్లు నేరుగా విసిరిన బంతులకే పడటం విస్మయపరిచింది. మన డిఫెన్స్‌పై నమ్మకం ఉంచుకోవడమే టెస్టు క్రికెట్లో ప్రధానం. సరిగ్గా ఆడటకపోవడంతోనే మ్యాచ్‌ త్వరగా ముగిసింది’ అని కోహ్లీ అన్నాడు.

మ్యాచులో కీలకంగా రాణించిన రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌పై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘జడ్డూకు గాయమైనప్పుడు చాలామంది (ప్రత్యర్థులు) ఊపిరి పీల్చుకున్నారు. కానీ అక్షర్‌ పటేల్‌ వచ్చాడు. వేగంగా ఎత్తుమీదుగా బంతులు విసిరాడు. వికెట్ సహకరించిందంటే అక్షర్‌ అత్యంత ప్రమాదకరంగా మారగలడు. మనం అశ్విన్‌ ఘనతనూ గుర్తించాల్సి ఉంది. టెస్టు ఫార్మాట్లో ఆధునిక క్రికెట్లో అతడో దిగ్గజం. అతడు నా జట్టులో ఉండటం కెప్టెన్‌గా ఆనందిస్తాను’ అని విరాట్‌ అన్నాడు. యాష్‌ 77 టెస్టుల్లోనే 400 వికెట్ల మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే.

టీమ్‌ఇండియా చేతిలో ఘోర ఓటమి క్షమార్హం కాదని ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన శుభారంభాన్ని అందిపుచ్చుకోలేదని అతడు పేర్కొన్నాడు. ‘మేం 70/2తో ఉన్నాం. కానీ దాన్ని మా జట్టు  అందిపుచ్చుకోలేదు. ఈ వికెట్‌పై 250 పరుగులు చేసుంటే మరోలా ఉండేది. ఈ ఘోర వైఫల్యం నుంచి మేం మెరుగైన జట్టుగా పుంజుకొని తిరిగొస్తాం. బంతిపై ప్లాస్టిక్‌ పూత పిచ్‌పై వేగాన్ని అందిపుచ్చుకుంది. టీమ్‌ఇండియా సైతం అత్యుత్తమంగా బంతులు విసిరింది. వికెట్‌పై రెండు జట్లూ ఇబ్బంది పడ్డాయి. గత మ్యాచ్‌ ఓటమి ఒత్తిడిని మేమిక్కడికి తీసుకురాలేదు. మేం వికెట్లు తీయగలమని అనిపించింది. ఇక నేను ఐదు వికెట్లు తీశానంటే అది పిచ్‌ వల్లే. వందో మ్యాచ్‌ ఆడిన ఇషాంత్‌కు అభినందనలు’ అని రూట్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని