Tokyo olympics: రవి దహియా గ్రామస్థుల క్రీడాస్ఫూర్తికి అభినందనలు: ఆనంద్‌ మహీంద్రా

టోక్యో ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా గ్రామస్థులను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ప్రత్యేకంగా అభినందించారు.

Published : 05 Aug 2021 20:35 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా గ్రామస్థులను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్‌ చేశారు. ఒలింపిక్స్‌లో రవి దహియా ప్రదర్శనపై ఆయన గ్రామస్థుడి స్పందనను ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో షేర్‌ చేశారు. పసిడి పతకం చేజారినా.. రవి ప్రదర్శనపై వారు సంతృప్తి వ్యక్తం చేయడాన్ని ఆనంద్‌ మహీంద్రా ప్రశంసించారు.  ఒలింపిక్స్‌లో రజతం సాధించడంపై తమ స్పందన తెలియజేయాలని ఆయన గ్రామస్థులను ఓ వార్తా ఛానెల్‌ కోరింది. దానికి సమాధానంగా ఓ గ్రామస్థుడు మాట్లాడుతూ.. ‘‘ఒలింపిక్స్‌లో రవి ప్రదర్శనను మేము ఆస్వాదించాం. అతడు బంగారు పతకం సాధించలేకపోయినా మేము నిరాశ చెందడం లేదు. పైగా ఎలాంటి వనరులూ అందుబాటులో లేకపోయినా రజతం సాధించడం చాలా గొప్ప విషయం. ఇది మాకు పసిడి పతకం కన్నా ఎక్కువ. రవికి మా గ్రామస్థులంతా కలిసి ఘనంగా స్వాగతం పలుకుతాం’’ అని చెప్పారు. దీనికి సంబంధించిన ట్వీట్‌ను ఆనంద్‌ మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

‘‘పతకాల శ్రేణిలో మనం తక్కువే కావచ్చు.. కానీ ఒలింపిక్స్‌లో పోటీపడటం చాలా ముఖ్యమైన అంశం. ఈ తరుణంలో రవి దహియా గ్రామస్థులు చూపిన క్రీడాస్ఫూర్తిని నేను మనసారా అభినందిస్తున్నాను’’ అని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని