INDvsAUS: గబ్బాలో పుజారా ఆస్ట్రేలియన్‌లా ఆడాడు!

టీమ్‌ ఇండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా గబ్బాలో ఆస్ట్రేలియన్‌లా ఆడాడని ఆసీస్‌ ఓపెనర్‌ మార్కస్ హ్యారిస్‌ అన్నాడు....

Published : 22 May 2021 15:10 IST

మరి మీరెందుకు ఆడటం లేదని జాఫర్‌ పంచ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ ఇండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా గబ్బాలో ఆస్ట్రేలియన్‌లా ఆడాడని ఆసీస్‌ ఓపెనర్‌ మార్కస్ హ్యారిస్‌ అన్నాడు. శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్ పంత్ అదరగొట్టారని కూడా ప్రశంసించాడు. పుజారా ఆధారంగానే వారిద్దరూ ఇన్నింగ్స్‌లు నిర్మించారని తెలిపాడు. అయితే ఆస్ట్రేలియన్లు మాత్రం ఎందుకు ఆస్ట్రేలియన్లలా ఆడటం లేదని భారత మాజీ ఓపెనర్‌ వసీమ్‌ జాఫర్‌ అతడికి పంచ్‌ ఇచ్చాడు.

‘ఆఖరి రోజు ఆట అద్భుతం. టీమ్‌ ఇండియా పరుగులు చేస్తుందా? లేదా వికెట్లను కాపాడుకుంటుందా? అన్న రీతిలో మా ఆలోచనా విధానం సాగింది. కానీ రిషభ్ ఆ రోజు అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. నిజమైన హీరో మాత్రం పుజారానే. ఆసీస్‌ బౌలర్లను అతడే కాచుకున్నాడు. అడ్డంకులను అధిగమించాడు. అతడు ఆస్ట్రేలియన్‌లా ఆడినట్టు నాకు అనిపించింది. ఛాతిపైకి వచ్చిన బంతుల దెబ్బలు తగిలినా భయపడలేదు. అతడి ఆధారంగానే మిగతా వాళ్లు బ్యాటింగ్‌ చేశారు’ అని హ్యారిస్‌ అన్నాడు.

‘రిషభ్ పంత్‌ ఇన్నింగ్స్‌ మాత్రం నమ్మశక్యం కానిది. అతడిలో ఏదో ఇంద్రజాలం ఉందని అంతా అంటారు. చాలాసార్లు అతడూ దానిని ప్రదర్శించాడు. ఆ సిరీస్‌ ఓడిపోవడం మాకు నిరాశ కలిగించింది. కానీ కొన్నిసార్లు క్రికెట్‌లో అవతలి వారిని అద్భుతంగా ఆడారని ప్రశంసించక తప్పదు’ అని హ్యారిస్‌ తెలిపాడు. ఈ వార్తలు చూసిన వెంటనే టీమ్‌ ఇండియా మాజీ ఓపెనర్‌ వసీమ్‌ జాఫర్‌ స్పందించాడు. ‘మరెందుకు ఆస్ట్రేలియన్లు మాత్రం ఆస్ట్రేలియన్లలాగా ఆడటం లేదని ఆశ్చర్యం వేస్తోంది’ అని అతడు ట్వీట్‌ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని