PV Sindhu: ఇండోనేషియా మాస్టర్స్-2021 టోర్నీ.. సెమీస్‌లో సింధు ఓటమి

ఒలింపిక్‌ పతకాల విజేత, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు దూకుడుకు ఇండోనేషియా మాస్టర్స్‌ 2021 టోర్నమెంట్‌ సెమీస్‌లో...

Published : 20 Nov 2021 19:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒలింపిక్‌ పతకాల విజేత, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు దూకుడుకు ఇండోనేషియా మాస్టర్స్‌ 2021 టోర్నమెంట్‌ సెమీస్‌లో అడ్డుకట్ట పడింది. సెమీఫైనల్‌లో జపాన్‌కు చెందిన యమగుచి చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.  ఏకపక్షంగా సాగిన పోరులో 13-21, 9-21 తేడాతో కేవలం 32 నిమిషాల్లోనే ఓటమిపాలైంది. మూడో సీడెడ్‌ అయిన పీవీ సింధు తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేకపోయింది. ఆది నుంచే యమగుచి ప్రతాపం చూపడంతో సింధు తలవంచకతప్పలేదు. తొలి సెట్‌లో కాస్త పోరాడినా ప్రయోజనం దక్కలేదు. రెండో సెట్‌లోనూ ఆరంభంలో యమగుచి మీద ఆధిక్యత ప్రదర్శించింది. అయితే ఒక్కసారిగా పుంజుకున్న యమగుచి సూపర్‌ గేమ్‌ ఆడటంతో పీవీ సింధు ఓటమిని చవిచూసింది. యాన్‌ సియాంగ్‌, ఫిట్టాయాపార్న్‌ చాయ్‌వాన్ మధ్య జరిగే సెమీఫైనల్‌ విజేతతో టైటిల్‌ కోసం యమగుచి పోరాడనుంది. 

విజయాల పరంగా ఈ మ్యాచ్‌ ముందు వరకు యమగుచిపై పీవీ సింధు 12-7 ఆధిక్యంతో కొనసాగింది. అలానే గత రెండు మ్యాచుల్లోనూ యమగుచిని సింధు చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో మరోమారు యమగుచిపై నెగ్గి ఫైనల్‌కు వెళ్తుందని భావించినా.. పరాభవం తప్పలేదు. మరోవైపుపురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో మూడో సీడ్‌ ఆండర్స్‌ ఆంథోన్సెన్‌తో కిదాంబి శ్రీకాంత్‌ పోటీపడతాడు. వీరిద్దరు మూడు సార్లు తలపడగా.. ఒక మ్యాచ్‌లో శ్రీకాంత్‌, రెండింట్లో ప్రత్యర్థి పైచేయి సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని