టీమిండియా ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలు!

సిడ్నీ వేదికగా జరుగుతున్న భారత్‌×ఆసీస్‌ మూడో టెస్టులో కొందరు ఆస్ట్రేలియా అభిమానులు అతిగా ప్రవర్తించారు. టీమిండియా ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌పై జాత్యంహకార...

Updated : 09 Jan 2021 16:55 IST

ఇంటర్నెట్‌డెస్క్: సిడ్నీ వేదికగా జరుగుతున్న భారత్‌×ఆసీస్‌ మూడో టెస్టులో కొందరు ఆస్ట్రేలియా అభిమానులు అతిగా ప్రవర్తించారు. రెండు, మూడో రోజు ఆట సమయంలో టీమిండియా ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌పై జాత్యంహకార వ్యాఖ్యలు చేశారు. బౌండరీ లైన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆటగాళ్లపై దురహంకార వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. భారత జట్టు యాజమాన్యం ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ)కు దృష్టి తీసుకెళ్లి ఫిర్యాదు చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్‌ హాక్లీతో మాట్లాడింది. సీఏ అధికారులు సిరాజ్‌తో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకున్నారు.

శనివారం ఆట ముగిసిన తర్వాత టీమిండియా సారథి అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్‌ కూడా ఈ విషయంపై అంపైర్లు పాల్‌ రీఫెల్‌, విల్సన్‌కు తెలియజేశారు. అనంతరం అంపైర్లు భద్రతా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మైదానంలో ఉన్న ఐసీసీ సెక్యూరిటీ అధికారి కూడా టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి పరిస్థితులు తెలుసుకున్నాడు. దీనిపై ఐసీసీ పూర్తి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సంఘటనపై టీమిండియా యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది.

అయితే మద్యం సేవించిన ఓ ఆసీస్‌ అభిమాని.. సిరాజ్‌ను ‘కోతి’ అని పిలిచాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 2007 సిడ్నీ టెస్టులో జరిగిన ‘మంకీగేట్’ ఉదంతాన్ని గుర్తుచేయాలనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశాడని వెల్లడించాయి. 2007-08 ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో మంకీగేట్ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. హర్భజన్‌ సింగ్‌ తనని కోతి అని పిలిచాడని ఆసీస్ ఆల్‌రౌండర్ సైమండ్స్‌ ఫిర్యాదు చేశాడు. అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని భజ్జీ వివరణ ఇచ్చాడు. కాగా, అప్పట్లో మంకీగేట్ ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి

మూడో టెస్టుపై పట్టుబిగించిన ఆసీస్‌ 

పుజారా బ్యాటింగ్‌తో ఇతరులపై ఒత్తిడి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని