Rahul Dravid: టీమిండియా కోచ్‌గా ద్రవిడ్‌ ఎంపిక సరైనదే: ఎమ్మెస్కే ప్రసాద్‌

మాజీ ఆటగాడు, ప్రస్తుత ఎన్‌సీఏ హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను టీమిండియా కోచ్‌గా ఎంపిక చేయడం సరైన నిర్ణయమని మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నాడు. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగుస్తున్న..

Published : 16 Oct 2021 19:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మాజీ ఆటగాడు, ప్రస్తుత ఎన్‌సీఏ హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను టీమిండియా కోచ్‌గా ఎంపిక చేయడం సరైన నిర్ణయమని మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నాడు. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగుస్తున్న నేపథ్యంలో.. తదుపరి కోచ్‌గా ద్రవిడ్‌ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ‘టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ సరైన వ్యక్తి అని నేను గతంలోనే చెప్పాను. అతడు ఆటగాళ్లతో త్వరగా కలిసిపోగలడు. రవిశాస్త్రి నేతృత్వంలో టీమిండియా మెరుగ్గా రాణించింది. ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచింది. వరుసగా విజయాలు సాధించడమంటే మామూలు విషయం కాదు. ఇక ముందు కూడా ఇదే విజయ పరంపర  కొనసాగించాలంటే.. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ లాంటి వ్యక్తిని ఎంపిక చేయడం సరైన నిర్ణయం’ అని ప్రసాద్ పేర్కొన్నాడు. 

ఇటీవల రాహుల్ ద్రవిడ్‌తో చర్చలు జరిపిన బీసీసీఐ వర్గాలు.. భారత జాతీయ జట్టుకు కోచ్‌గా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాఠోడ్‌ కొనసాగే వీలుంది. ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్‌.శ్రీధర్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, ద్రవిడ్ పర్యవేక్షణలో చాలా మంది యువ ఆటగాళ్లు అండర్‌-19 స్థాయిలో మేటి ఆటగాళ్లుగా తయారైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారంతా భారత జట్టులోనూ మెరుగ్గా రాణిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని