Sushil kumar: సస్పెండ్‌ చేయనున్న రైల్వేస్‌

హత్యానేరం అభియోగాలు ఎదుర్కొంటున్న రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌ ప్రతిష్ఠ వేగంగా మసకబారుతోంది. అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేసేందుకు రంగం.......

Published : 24 May 2021 18:22 IST

దిల్లీ: హత్యానేరం అభియోగాలు ఎదుర్కొంటున్న రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌ ప్రతిష్ఠ వేగంగా మసకబారుతోంది. అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం అతడు ఉత్తర రైల్వేస్‌లో ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీగా పని చేస్తున్నాడు. ‘దిల్లీ ప్రభుత్వం నుంచి కేసుకు సంబంధించిన నివేదిక ఆదివారమే రైల్వే బోర్డుకు అందింది. అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సుశీల్‌ను సస్పెండ్‌ చేస్తాం’ అని ఉత్తర రైల్వే సీపీఆర్వో దీపక్‌ కుమార్‌ పీటీఐకి తెలిపారు.

ఛత్రసాల్‌ స్టేడియంలో నెలరోజుల క్రితం సాగర్‌ రాణా అనే యువ రెజ్లర్‌పై దాడి జరిగింది. అందులో రాణా మరణించాడు. ఈ కేసులో సుశీల్‌పై అభియోగాలు నమోదయ్యాయి. దాడి జరిగినప్పుడు స్టేడియంలో అతడి ఉనికి కనిపించిందని పోలీసులు నిర్ధరించారు. దాడికి పాల్పడిన వారిలో కొందరిని పట్టుకోగా వారు సుశీల్‌ పేరు చెప్పారు. అప్పటి నుంచి అతడు తప్పించుకొని తిరిగాడు. దాదాపుగా మూడు వారాలు పోలీసులు అతడికి కోసం వెతికారు.

పోలీసులు తీవ్రంగా గాలిస్తుండటంతో సుశీల్‌ ఒక చోటు నుంచి మరో చోటుకు తప్పించుకొని తిరిగాడు. దాంతో అధికారులు లుకౌట్‌ నోటీసు జారీ చేశారు. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష  బహుమానం ప్రకటించారు. అకస్మాత్తుగా నాలుగు రోజుల క్రితం అతడు ముందుస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. కోర్టు దానిని తిరస్కరించింది. ఎట్టకేలకు ఆదివారం అతడిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్‌ విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని