Virat Kohli: కోహ్లీతో పెట్టుకోవద్దు.. కింగ్‌ కోహ్లీ ఈజ్‌ బ్యాక్‌: రవిశాస్త్రి

బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీతో పెట్టుకోవద్దని, అతడు తిరిగి ఫామ్‌ అందుకున్నాడని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు...

Published : 21 May 2022 02:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీతో పెట్టుకోవద్దని, అతడు తిరిగి ఫామ్‌ అందుకున్నాడని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు. విరాట్ తన ఆటతో విమర్శకులందరికి సమాధానం చెప్పాడన్నాడు. గతరాత్రి గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ (73; 54 బంతుల్లో 8x4, 2x6) ధాటిగా ఆడి అందర్నీ అలరించిన సంగతి తెలిసిందే. చూడచక్కని షాట్లతో గుజరాత్‌ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన అతడు క్రీజులోనూ చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. దీంతో కింగ్‌ కోహ్లీ ఈజ్‌ బ్యాక్‌ అంటూ ప్రపంచానికి చాటిచెప్పాడని శాస్త్రి ప్రశంసలు కురిపించాడు.

‘కోహ్లీ ఏంటో నిరూపించుకున్నాడు. అదృష్టంకొద్దీ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తే అక్కడ మరోసారి అతడి ఆటను చూడొచ్చు. ఒకవేళ దిల్లీతో వెనుకబడితే మనమంతా ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ ఆటతో కేవలం తన విమర్శకులకే కాకుండా ప్రపంచానికి కూడా తనతో పెట్టుకోవద్దని చాటి చెప్పాడు. ఆటలో సత్తా ఉంటే కుర్రాళ్లు ఎలా ఆడాలో అదే నేర్పిస్తుంది’ అని ఓ క్రీడా ఛానల్‌తో అన్నాడు. కాగా, ఇటీవలే కోహ్లీ ప్రదర్శనపై స్పందించిన రవిశాస్త్రి కొంత కాలం అతడిని విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. అయితే, ఇదే విషయాన్ని విరాట్‌ కూడా తాజాగా ప్రస్తావించాడు. గుజరాత్‌తో మ్యాచ్‌కు ముందు హర్భజన్‌సింగ్‌తో మాట్లాడిన సందర్భంగా శాస్త్రి చేసిన వ్యాఖ్యలను విరాట్‌ గుర్తుచేసుకున్నాడు. తనను రవిశాస్త్రి చాలా దగ్గరి నుంచి చూశాడని, ఆయన మాటలను పరిగణనలోకి తీసుకొని విశ్రాంతి తీసుకునేందుకు ఆలోచిస్తానన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు