Ricky Ponting: పంత్‌ సరైనోడే.. ఇంకా నేర్చుకుంటున్నాడు: రికీ పాంటింగ్

దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ యువకుడేనని, అతడింకా కెప్టెన్సీ గురించి నేర్చుకుంటున్నాడని ఆ జట్టు ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు...

Published : 22 May 2022 14:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ యువకుడేనని, అతడింకా కెప్టెన్సీ గురించి నేర్చుకుంటున్నాడని ఆ జట్టు ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ప్లేఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేక తీవ్ర విమర్శల పాలయ్యాడు పంత్‌. ఈ నేపథ్యంలోనే పాంటింగ్‌ మాట్లాడుతూ రిషభ్‌ పంతే దిల్లీ జట్టుకు సరైన నాయకుడని కీర్తించాడు. అతడు జట్టు పగ్గాలు అందుకున్నప్పటి నుంచి అద్భుతంగా నడిపిస్తున్నాడని చెప్పాడు.

‘గతేడాది పంత్‌ను కెప్టెన్‌గా చేశాం. అతడే సరైన నాయకుడు. శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడిన తర్వాత జట్టును బాగా నడిపించాడు. అయితే, అతడింకా యువకుడే. కెప్టెన్సీ గురించి ఇంకా నేర్చుకుంటున్నాడు. టీ20ల్లో కెప్టెన్సీ అంత ఆషామాషీ కాదు. ముఖ్యంగా అత్యంత ఒత్తిడి ఉండే భారత టీ20 లీగ్‌లో మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో ప్రతి చిన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, పంత్‌కు నా పూర్తి మద్దతు ఉంటుంది’ అని పాంటింగ్‌ చెప్పుకొచ్చాడు.

పంత్‌ చాలా తెలివిగల ఆటగాడని, వికెట్ల వెనక నుంచి ఆటను బాగా అర్థం చేసుకుంటాడని కోచ్‌ మెచ్చుకున్నాడు. అతడు మరింత దృఢంగా తిరిగి వస్తాడన్నాడు. అలాగే ఈ సీజన్‌లో తమ జట్టు అనేక ఒడుదొడుకులను ఎదుర్కొందని చెప్పాడు. తమ శిబిరంలో పలువురు ఆటగాళ్లు అనారోగ్యం బారినపడ్డారని, మరి కొందరు కొవిడ్‌-19 బారిన పడ్డారని గుర్తుచేసుకున్నాడు. కాగా, ప్రస్తుత సీజన్‌లో దిల్లీ చివరి మ్యాచ్‌లో ముంబయిపై విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌ చేరే అవకాశం ఉన్నా మ్యాచ్‌ గెలవలేకపోయింది. ముఖ్యంగా ముంబయి బ్యాట్స్‌మన్ టిమ్‌ డేవిడ్‌ (34; 11 బంతుల్లో 2x4, 4x6) ధనాధన్‌ బ్యాటింగ్‌తో దిల్లీకి మ్యాచ్‌ను దూరం చేశాడు. అయితే, టిమ్‌ ఎదుర్కొన్న తొలి బంతికే పంత్‌ చేతికి చిక్కినా.. అదృష్టవశాత్తూ బతికిపోయాడు. ఆ బంతికి పంత్‌ రివ్యూకు వెళ్లి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని అభిమానులు విమర్శిస్తున్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని