Rishabh pant: పంత్‌ భవిష్యత్తు సారథి

రిషభ్‌ పంత్‌ తానొక మ్యాచ్‌ విజేతనని నిరూపించుకున్నాడని టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. అతడిలో భవిష్యత్తు సారథి కనిపిస్తున్నాడని పేర్కొన్నాడు. గిల్లీ, పంత్‌ తరహా బ్యాట్స్‌మన్‌ క్షణాల్లో ఆటను మార్చేస్తారని ప్రశంసించాడు....

Published : 09 Jul 2021 01:25 IST

అతడిది చురుకైన బుర్ర: యువీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిషభ్‌ పంత్‌ తానొక మ్యాచ్‌ విజేతనని నిరూపించుకున్నాడని టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. అతడిలో భవిష్యత్తు సారథి కనిపిస్తున్నాడని పేర్కొన్నాడు. గిల్లీ, పంత్‌ తరహా బ్యాట్స్‌మన్‌ క్షణాల్లో ఆటను మార్చేస్తారని ప్రశంసించాడు.

‘గతంతో పోలిస్తే రిషభ్ పంత్‌ మరింత పరిణతి సాధించాడని మీరంతా అంటున్నారు. అందుకు సంతోషం. ఎందుకంటే అతడు ఔటైన తీరు చూసి చాలామంది విమర్శించారు. అతడి గురించి సానుకూల మాటలు వినడం బాగుంది. తానొక మ్యాచ్‌ విజేతనని పంత్‌ నిరూపించుకున్నాడు. కఠిన పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో ఆడిన తీరు, ఇంగ్లాండ్‌లో శతకం చేసిన విధానం గొప్పది. మిడిలార్డర్‌లో అతడు అత్యంత కీలకం’ అని యువీ అన్నాడు.

గిల్‌క్రిస్ట్‌, రిషభ్ పంత్‌ తరహా ఆటగాళ్లు మ్యాచులను క్షణాల్లో మలుపు తిప్పేస్తారని యువీ అన్నాడు. టెస్టు క్రికెట్లో గిల్లీ క్రీజులోకి రాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయేదని గుర్తు చేశాడు. ఇప్పుడు రిషభ్ పంత్‌ను చూస్తే అలాగే అనిపిస్తోందని వివరించాడు. సిడ్నీలో 118 బంతుల్లో 97, బ్రిస్బేన్‌లో 138 బంతుల్లో 89*తో అజేయంగా నిలవడమే ఉదాహరణ అని వివరించాడు.

‘రిషభ్ పంత్‌లో నేను భవిష్యత్తు భారత సారథిని చూస్తున్నాను. ఎందుకంటే అతడు చురుగ్గా ఉంటాడు. అందరితో మాట్లాడుతుంటాడు. మైదానంలో సందడి చేస్తాడు. అంతేకాకుండా అతడిది తెలివైన బుర్ర. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున అతడి సారథ్యం గమనించాడు. చాలా చక్కగా రాణించాడు. మున్ముందు అతడిలో భారత కెప్టెన్‌ను చూడొచ్చు’ అని యువీ ముగించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని