Rohit Sharma : విండీస్‌తో సిరీస్‌.. జట్టు పగ్గాలు చేపట్టేందుకు రోహిత్‌ సిద్ధం!

గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన..

Published : 26 Jan 2022 02:01 IST

బుమ్రా, భువనేశ్వర్‌, అశ్విన్‌కి విశ్రాంతినిచ్చే అవకాశం

ఇంటర్నెట్ డెస్క్‌: గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన టీమ్‌ఇండియా వన్డే, టీ20 జట్ల సారథి రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌ సాధించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. విండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లకు రోహిత్‌ అందుబాటులో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. తెల్ల బంతి ఫార్మాట్‌కు పూర్తిస్థాయి నాయకుడిగా ఎంపికైన తర్వాత తొలిసారి జట్టు పగ్గాలను చేపట్టే అవకాశం ఉంది.  ‘‘రోహిత్ ఫిట్‌గా ఉన్నాడు. విండీస్‌తో సిరీస్‌కు సిద్ధం. దాదాపు ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకుని గాయం నుంచి కోలుకున్నాడు. ముంబయిలో శిక్షణ కూడా పూర్తి చేసుకున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్‌ టెస్టుకు హాజరవుతాడు. అందులో తప్పకుండా పాస్‌అవుతాడు’’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు పీటీఐతో వెల్లడించారు. 

ఈ వారంలోనే వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. ఇదే సమయంలో టెస్టు సారథ్యంపైనా నిర్ణయం తీసుకోవచ్చనే వాదనా వినిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ తర్వాత విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీని వదులుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుదీర్ఘ ఫార్మాట్‌కూ రోహిత్‌నే ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి. వరుసగా వన్డే, టీ20 ప్రపంచకప్‌లు ఉన్న నేపథ్యంలో పనిభారం కాకుండా టెస్టు సారథిగా వేరొకరి పేరును కూడా బీసీసీఐ పరిశీలిస్తోందని సమాచారం. కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ విజయవంతం అయినట్లు కనిపించలేదు. అదేవిధంగా ఐపీఎల్‌లోని లఖ్‌నవూ సూపర్‌ జెయింట్‌ సారథిగా కేఎల్‌ రాహుల్‌ పనితీరుపైనా దృష్టిసారించే అవకాశం ఉంది. 

గత ఐపీఎల్‌ సీజన్‌తోపాటు టీ20 ప్రపంచకప్‌లోనూ బౌలింగ్‌ చేయలేక ఇబ్బంది పడిన హార్దిక్‌ పాండ్య నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే ఇప్పటికీ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయగలడా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఒక వేళ విండీస్‌తో సిరీస్‌కు ఫిట్‌నెస్‌ సాధించలేకపోతే ఫిబ్రవరి చివర్లో శ్రీలంకతో జరిగే సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఆరో నంబర్‌లో వెంకటేశ్ అయ్యర్ ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అనుభవలేమితో ఆకట్టుకోలేకపోయాడు. వరుస షెడ్యూల్‌తో బిజీగా గడిపిన ఫాస్ట్‌బౌలర్‌ బుమ్రాకి విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే భువనేశ్వర్‌ కుమార్‌, అశ్విన్‌లకు బదులు అవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌కు ఛాన్స్‌ దక్కొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని