Rohit Sharma : ఫిట్‌నెస్‌ పరీక్షలో రోహిత్ పాస్‌.. జట్టు ఎంపికకు సెలక్షన్‌ కమిటీ కసరత్తు

టీమ్‌ఇండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌ పరీక్షలో..

Updated : 26 Jan 2022 22:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌ పరీక్షలో పాసయ్యాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్‌  వచ్చే నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే విండీస్‌ సిరీస్‌కు ఫిట్‌నెస్‌ సాధించాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలో రోహిత్‌ పాస్‌ అయినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దీంతో రోహిత్ పూర్తిస్థాయి సారథిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వెస్టిండీస్‌ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు భారత్‌కు రానుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మూడు వన్డేలు అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలోనూ, టీ20లు ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా జరుగుతాయి. 

విండీస్‌తో సిరీస్‌కు జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ కసరత్తు ప్రారంభించింది. బుమ్రాకు విశ్రాంతినివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో విఫలమైన భువనేశ్వర్‌, అశ్విన్‌కు చోటు దక్కడం కష్టమే. మరోవైపు వెన్నునొప్పి నుంచి కోలుకుని నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్‌ చేస్తున్న హార్దిక్‌ పాండ్యను ఎంపిక చేస్తారో లేదో వేచి చూడాలి. యువ లెగ్ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌కు టీమ్ఇండియా జట్టులోకి ఆహ్వానం వచ్చే అవకాశం ఉంది. విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేస్తారని పీటీఐ రిపోర్ట్‌ పేర్కొంది. అలానే సీనియర్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ మళ్లీ జట్టులోకి రానున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని