IPL 2021: రుతురాజ్‌ ఏదో ఒకరోజు టీమిండియాకు ఆడతాడు: మొయిన్ అలీ

ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)-2021 విజేత చెన్నై సూపర్ కింగ్స్‌ ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్ ఏదో ఒకరోజు కచ్చితంగా టీమిండియాకు ఆడతాడని ఆ జట్టు ఆల్-రౌండర్‌ మొయిన్ అలీ అన్నాడు. ఈ సీజన్‌లో అతడి ప్రదర్శన..

Published : 16 Oct 2021 19:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)-2021 విజేత చెన్నై సూపర్ కింగ్స్‌ ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్ ఏదో ఒకరోజు కచ్చితంగా టీమిండియాకు ఆడతాడని ఆ జట్టు ఆల్-రౌండర్‌ మొయిన్ అలీ అన్నాడు. ఈ సీజన్‌లో అతడి ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. 16 మ్యాచుల్లో 635 పరుగులు చేసిన రుతురాజ్‌ గైక్వాడ్‌ ఆరెంజ్‌ క్యాప్ అందుకున్న విషయం తెలిసిందే. ‘ప్రస్తుతం రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతడు ప్రతి షాట్‌ని ఎంతో శ్రద్ధతో ఆడతాడు. భవిష్యత్తులో అతడు తప్పకుండా టీమిండియాకు ఆడతాడు’ అని మొయిన్ అలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ ఫైనల్ మ్యాచ్‌ అనంతరం మొయిన్‌ అలీ మాట్లాడుతూ.. ‘ఈ అద్భుత విజయం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. ఫైనల్ కంటే ముందు మేం కొన్ని మ్యాచుల్లో ఓటమి పాలైనా.. తుది జట్టు ఎంపికలో ఎలాంటి మార్పుల్లేవు. ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలపై మా జట్టుకు స్పష్టత ఉంది’ అని పేర్కొన్నాడు.

ఈ సీజన్లో చెన్నై జట్టు యాజమాన్యం తనకు అందించిన సహకారం మరువలేనిదని మరో ఆటగాడు రాబిన్‌ ఉతప్ప పేర్కొన్నాడు. ‘తుది జట్టులో చోటు దక్కక డగౌట్‌కే పరిమితమైనప్పుడు.. మా జట్టు ఆటగాళ్లు అండగా ఉన్నారు. ప్రాక్టిస్‌ సెషన్లలో హెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, కోచ్‌ మైఖేల్ హస్సి ఎంతో సహకారం అందించారు. సహాయక సిబ్బంది కూడా తమ వంతు పోత్సహించారు’ అని రాబిన్‌ ఉతప్ప తెలిపాడు. శుక్రవారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ని 27 పరుగుల తేడాతో ఓడించి నాలుగో సారి ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని