Sachin: నొప్పితోనే 10 మ్యాచ్‌లు ఆడిన మాస్టర్‌

చరిత్రాత్మక సీబీ సిరీసు ఆడేటప్పుడు సచిన్‌ తెందూల్కర్‌ శారీరకంగా పూర్తి ఆరోగ్యంతో లేరని వెటరన్‌ ఆటగాడు రాబిన్‌ ఉతప్ప అన్నాడు...

Updated : 21 May 2021 14:54 IST

అతడికి జట్టు అవసరాలే ముఖ్యం: ఉతప్ప

ముంబయి: చారిత్రాత్మక సీబీ సిరీసు ఆడేటప్పుడు సచిన్‌ తెందూల్కర్‌ శారీరకంగా పూర్తి ఆరోగ్యంతో లేరని వెటరన్‌ ఆటగాడు రాబిన్‌ ఉతప్ప అన్నాడు. నొప్పితో విలవిల్లాడుతూనే పాజీ పరుగులు చేశాడని గుర్తు చేసుకున్నాడు. చివరి మ్యాచుల్లో మాస్టర్‌ బ్లాస్టర్‌ మెరుపుల వల్లే సిరీస్‌ కైవసం చేసుకున్నామని వివరించాడు.

ఆస్ట్రేలియా వేదికగా 2008లో జరిగిన ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా అద్భుత విజయాలు సాధించింది. నొప్పితోనే సచిన్‌ 10 మ్యాచుల్లో 399 పరుగులు చేశాడు. మూడో ఫైనల్‌ (బెస్టాఫ్‌ 3) ఆడకుండా ఉండేందుకు, ఆసీస్‌ను ఓడించేందుకు విధ్వంసాలు సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఉతప్ప.. సచిన్‌తో కలిసి 50, 94 వంటి విలువైన భాగస్వామ్యాలు అందించాడు. మాస్టర్‌ తొలి ఫైనల్‌లో 117, రెండో ఫైనల్‌లో 91 పరుగులు చేయడం గమనార్హం.

‘మీరు నమ్మరు. తీవ్రమైన నొప్పి భరిస్తూనే సచిన్‌ కామన్వెల్త్‌ బ్యాంక్‌ సిరీస్‌ ఆడాడు. శారీరకంగా అతడు పూర్తి సంసిద్ధంగా లేడు. నొప్పి తట్టుకోలేక కొన్నిసార్లు విలవిల్లాడిన సందర్భాలూ ఉన్నాయి. ఆరోగ్యం గురించి మేమెప్పుడు అడిగినా చాలా బాగున్నానని చెప్పేవాడు. తనకన్నా జట్టు అవసరాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడు’ అని ఉతప్ప చెప్పాడు.

‘సిరీస్‌ సాంతం మేమిద్దరం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 32 ఏళ్లు దాటాక ఫిట్‌గా ఉండటం కష్టమని ఒకసారి నాతో చెప్పాడు. గాయాలవుతాయని, మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని వివరించాడు. అప్పుడు  నా వయసు కేవలం 21-22 ఉంటుంది. అలా ఏం ఉండదు పాజీ.. అని నేను బదులిచ్చాను. అయితే నాకు 35 ఏళ్లు వచ్చాక మళ్లీ ఈ విషయంపై చర్చిద్దామన్నాడు. అప్పుడు నేను తన అభిప్రాయాన్ని అంగీకరిస్తానో లేదో చూస్తానని చెప్పాడు. ఇప్పుడు నా వయసు 35. సచిన్‌ అద్భుతమని  చెప్పగలను’ అని ఉతప్ప తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని