సచిన్‌ ఆడకపోతే.. పాక్‌‌ దెబ్బకొట్టేది! 

క్రికెట్‌ ప్రేక్షకుల్లో భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే సహజంగానే అమితాసక్తి నెలకొంటుంది. అలాంటిది ప్రపంచకప్‌ లాంటి మెగా ఈవెంట్‌లో ఇరు జట్లూ కీలకమైన సెమీ ఫైనల్స్‌లో తలడపడటమంటే మాటలా..!...

Published : 30 Mar 2021 14:10 IST

తెందూల్కర్‌కు అదృష్టం కలిసొచ్చిన వేళ భారత్‌ విజయం.. 

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ ప్రేక్షకుల్లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే సహజంగానే అమితాసక్తి నెలకొంటుంది. అలాంటిది ప్రపంచకప్‌ లాంటి మెగా ఈవెంట్‌లో ఇరు జట్లూ కీలకమైన సెమీ ఫైనల్స్‌లో తలడపడటమంటే మాటలా..! ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. మరీ ముఖ్యంగా దాయాదులపై క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ఆధిపత్యం చెలాయించిన వేళ.. అతడికి పలుమార్లు అదృష్టం కలిసొచ్చిన సమయాన టీమ్ఇండియా విజయం సాధించింది. అది భారత క్రికెట్‌ అభిమానులకు ఎప్పటికీ ప్రత్యేకమే. అది జరిగి నేటికి సరిగ్గా పదేళ్లు. ఈ సందర్భంగా నాటి విశేషాలు గుర్తు చేసుకుందాం..


ఇద్దరు ప్రధానుల రాక.

మొహాలి వేదికగా 2011 వన్డే ప్రపంచకప్‌లో మార్చి 30న భారత్‌-పాకిస్థాన్‌ జట్లు తలపడ్డాయి. అది కూడా కీలకమైన సెమీస్‌ పోరులో. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి ఇరు దేశాల ప్రధానులు హాజరయ్యారు. అప్పటి భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆహ్వానం మేరకు పాక్‌ ప్రధానిగా ఉన్న యూసుఫ్‌ రజా గిలానీ ప్రత్యేకంగా మొహాలీకి వచ్చి మరీ మ్యాచ్‌ను తిలకించారు. అలాగే పాక్‌ నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చాలావరకు టికెట్లు బ్లాక్‌లో అమ్ముడుపోయాయి. కీలకమైన పోరును ప్రత్యక్షంగా చూసి ఆనందించాలని నిర్ణీత ధరకన్నా మూడింతలు ఎక్కువే పెట్టి అభిమానులు కొనుగోలు చేశారు. దాంతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది.


సచిన్‌ ఒంటరిపోరాటం..

ఇక టాస్‌గెలిచి టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్‌(38; 25 బంతుల్లో 9x4), సచిన్‌ ‌(85; 115 బంతుల్లో 11x4) ఆదిలోనే దంచికొట్టారు. తొలి వికెట్‌కు 5.5 ఓవర్లలో 48 పరుగులు జోడించి శుభారంభం చేశారు. అదే సమయంలో సెహ్వాగ్‌ ఔటవ్వడంతో.. గంభీర్(27; 32 బంతుల్లో 2x4)తో కలిసి సచిన్‌ ఇన్నింగ్స్‌ నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 68 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే గంభీర్‌, కోహ్లీ(9), యువరాజ్‌(0) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. దాంతో టీమ్‌ఇండియా 25.3 ఓవర్లకు 141/4తో కష్టాల్లో పడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు సచిన్‌ ఒంటరిపోరాటం చేశాడు. ధోనీ(25; 42 బంతుల్లో 2x4)తో కలిసి ఐదో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే, శతకానికి చేరువ అవుతున్న వేళ అజ్మల్‌ బౌలింగ్‌లో అఫ్రిది చేతికి చిక్కాడు. అప్పటికే పలుమార్లు జీవనదానం లభించిన మాస్టర్‌కు ఈసారి అవకాశం దక్కలేదు. జట్టు స్కోర్‌ 187 పరుగుల వద్ద పెవిలియన్‌ చేరాడు. అందులో సచిన్‌ చేసినవే 85 పరుగులున్నాయి. ఇక జట్టు స్కోర్‌ 200 దాటాక ధోనీ సైతం వెనుదిరిగాడు. చివర్లో రైనా(36*; 39 బంతుల్లో 3x4) కాస్త పరుగులు చేయడంతో టీమ్‌ఇండియా స్కోర్‌ 260/9గా నమోదైంది.


భయపెట్టినా తోకముడిచింది..

అప్పటి బ్యాటింగ్‌ లైనప్‌ చూస్తే పాకిస్థాన్‌కు 261 పరుగుల ఛేదన పెద్ద కష్టమేమీ కాదనిపించింది. దానికి తోడు ఓపెనర్లు కమ్రన్‌ అక్మల్‌(19; 21 బంతుల్లో 3x4), మహ్మద్‌ హఫీజ్‌(43; 59 బంతుల్లో 7x4) ధాటిగా ఆడి కాస్త హడలెత్తించారు. తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించాక జహీర్‌.. అక్మల్‌ను ఔట్‌చేసి టీమ్‌ఇండియాకు వికెట్ల ఖాతా తెరిచాడు. కాసేపటికే మునాఫ్‌ పటేల్‌ అద్భుతమైన డెలివరీతో హఫీజ్‌ను బుట్టలో వేసుకున్నాడు. ఇక జట్టు స్కోర్‌ వంద దాటాక యువీ వరుస ఓవర్లలో రెండు కీలక వికెట్లు తీసి భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. అసద్‌ షాఫిక్‌(30), యూనిస్‌ఖాన్‌(13)ను తక్కువ స్కోర్లకే పరిమితం చేశాడు. ఆపై మిస్బా ఉల్‌ హక్‌(56; 76 బంతుల్లో 5x4, 1x6) పోరాడినా మరో ఎండ్‌లో సహకరించే బ్యాట్స్‌మెన్‌ లేకపోయారు. మధ్యలో ఉమర్‌ అక్మల్‌(29; 24 బంతుల్లో 1x4, 2x6) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ హర్భజన్‌ బౌల్డ్‌ చేయడంతో పాక్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. అబ్దుల్‌ రజాక్‌(3), అఫ్రిది(19) విఫలమవడంతో పాక్‌ 49.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. దాంతో టీమ్‌ఇండియా 29 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. అలా ఫైనల్‌కు చేరి అక్కడ శ్రీలంకను చిత్తుచేసింది. ఈ నేపథ్యంలోనే ధోనీసేన 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో సచిన్‌ ఒంటరిపోరాటానికి తోడు భారత బౌలర్లు సమష్టిగా రాణించడం అభిమానులకు ఎప్పటికీ తీపి జ్ఞాపకమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు