Sania Mirza : ఆటకు వీడ్కోలు చెబుతా.. ఇదే నా చివరి సీజన్: సానియా

ఆటకు రిటైర్‌మెంట్‌ తీసుకోనున్నట్లు సానియా మీర్జా వెల్లడించింది. 

Updated : 19 Jan 2022 15:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత సీజనే (2022) తనకు చివరిదని భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ప్రకటించింది. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. సానియా మీర్జా అంతర్జాతీయంగా 68వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. మూడు సార్లు మహిళల డబుల్స్‌ టైటిళ్లు, మిక్స్‌డ్‌ డబుల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ విజేతగా సానియా మీర్జా నిలిచింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లోనే సానియా జోడీ ఓటమిపాలైంది. 

ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ.. ‘‘కొన్ని రోజులుగా మోకాలు, మోచేయి నొప్పితో బాధపడుతున్నా. అయితే ఆస్ట్రేలియా ఓపెన్‌ ఓటమికి అవి కారణాలుగా చెప్పదల్చుకోలేదు. అలా అని కెరీర్‌ను పొడిగించనూలేను. ఇదే చివరి సీజన్‌ అని మాత్రం చెప్పగలను. గతేడాది ఆఖర్లోనే నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికీ ఆటను ఆస్వాదించేందుకు సిద్ధంగానే ఉన్నా. అయితే ఇప్పుడు నా వయస్సు 35. ఈ సీజన్‌ను విజయవంతంగా ముగించడమే నా ముందున్న లక్ష్యం. కనీసం యూఎస్‌ ఓపెన్‌ (జూన్‌ 16-19) వరకు ఆడేందుకు ప్రయత్నిస్తా. తల్లి అయిన తర్వాత ఫిట్‌నెస్‌ సాధించేందుకు చాలా కష్టపడ్డా. నాకు నేను మోటివేషన్‌ చేసుకునేదాన్ని. అయితే గతంలో ఉన్న ఎనర్జీ లేదనే చెప్పాలి. అలానే గాయాల నుంచి కోలుకునేందుకు చాలా రోజుల సమయం పడుతోంది. మూడేళ్ల కుమారుడిని నాతోపాటు విదేశాలకు తీసుకెళ్లడం కూడానూ రిస్క్‌తో కూడుకున్నదే’’ అని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని