Saurav Ganguly: కోహ్లీకి షోకాజ్‌ నోటీసులుపంపాలనుకున్న గంగూలీ!

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ విరాట్‌ కోహ్లీకి షోకాజ్‌ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట.

Updated : 21 Jan 2022 06:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన ఆటతీరుతో విరాట్‌ కోహ్లీ భారత జట్టును మరోస్థాయికి తీసుకెళ్లాడనంలో ఎలాంటి సందేహం లేదు. విజయవంతమైన కెప్టెన్‌గా కోట్ల మంది అభిమానుల మనసులు గెలుచుకున్న కోహ్లీ ఇటీవలే అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా వైదొలిగిన విషయం తెలిసిందే.  అయితే బీసీసీఐ యాజమాన్యానికి, కోహ్లీకి పొసగడం లేదని తరచూ వార్తలు వస్తున్నాయి. అందుకే కోహ్లీ కెప్టెన్సీని వదులుకున్నాడని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ అంశాలకు ఆజ్యం తాజాగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.  కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన అనంతరం.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరేముందు విలేకరుల సమావేశం నిర్వహించాడు. ఈ సమావేశంలో తనపై జరుగుతున్న ప్రచారంపై కోహ్లీ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని చెబితే తననెవరూ ఆపలేదని తెలిపాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  అయితే ఒకానొక సందర్భంలో ఈ వ్యాఖ్యలతో ఏకీభవించని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ విరాట్‌ కోహ్లీకి షోకాజ్‌ నోటీసులు పంపేందుకు సిద్ధమయ్యాడట. విలేకరుల సమావేశంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని గంగూలీ భావించాడట. అయితే షోకాజు నోటీసులు పంపేముందు గంగూలీ ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షాకు తెలిపాడట. దీంతో ఆయన ఈ విషయం పెద్దది కాకుండా గంగూలీని ఒప్పించాడట.  ప్రస్తుతం ఈ వార్త మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సౌరభ్‌ గంగూలీతో సంబంధాలు దెబ్బతినడంతోనే విరాట్‌ కోహ్లీ అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా వైదొలిగాడా అన్న ప్రశ్నలకు షోకాజు నోటీస్‌ అంశం బలాన్ని చేకూరుస్తోంది. 

ఏం జరిగిందంటే..
2021లో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యం చెందడంతో కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అనంతరం బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ కోహ్లీని వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించింది. వన్డే, టీ20లకు భిన్న సారథ్యం సరికాదన్న వాదనను బీసీసీఐ తెరపైకి తీసుకొచ్చింది. రెండు ఫార్మాట్లకు కెప్టెన్‌లుగా వేరువేరుగా ఉంటే జట్టుపై తీవ్రప్రభావం పడుతుందని పేర్కొంది. దీంతో దక్షిణాఫ్రికాతో వన్డేలకు కెప్టెన్‌గా, టెస్టులకు వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ను నియమించింది. ఈ సమయంలో బీసీసీఐ నుంచి మీడియాకు కొన్ని లీకులు వెళ్లడం కోహ్లీని మనస్తాపానికి గురిచేశాయి. తనపై జరుగుతున్న ప్రచారానికి దక్షిణాఫ్రికాకు వెళ్లే ముందు విలేకరుల సమావేశంలో పలు ఘాటైన వ్యాఖ్యలు చేశాడు.  తనని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి గంటన్నర ముందు మాత్రమే సమాచారం ఇచ్చారని, టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని ఎవరూ చెప్పలేదని అన్నాడు. కెప్టెన్సీ వదులుకోవద్దంటూ కోహ్లీతో తాను మాట్లాడానని అంతకుముందు గంగూలీ చేసిన ప్రకటనకు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది. అప్పట్లో కోహ్లీ ప్రకటన భారత క్రికెట్లో ప్రకంపనలు సృష్టించింది. ఇక మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ గెలవగా, దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌ గెలిచింది. ఇక కీలక మూడో టెస్టుకు జట్టును ఎంపిక చేయడంలో ముసలం పుట్టినట్లు తెలిసింది. మూడో టెస్టుకు ఆజింక్య రహానెకు బదులుగా శ్రేయస్‌ అయ్యర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని కోహ్లీ సూచించినట్లు తెలిసింది. కోచ్‌ ద్రవిడ్‌ మాత్రం రహానె వైపు మొగ్గుచూపడం.. అందుకు బీసీసీఐ పెద్దలు మద్దతు పలకడంతో కోహ్లీని మనస్తాపానికి గురైనట్లు సమాచారం. జట్టు ఎంపికలో, తుది జట్టు కూర్పులో తన ప్రమేయం లేకుండా పోవడంతో కోహ్లీ మూడో టెస్ట్‌ అనంతరం టెస్ట్‌ ఫార్మాట్‌కు కెప్టెన్‌గా వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని