
ద్రవిడ్‌తో 18 ఏళ్ల నాటి సంఘటన.. గుర్తు చేసుకున్న స్కాట్లాండ్ కెప్టెన్
ఇంటర్నెట్ డెస్క్: ద్రవిడ్‌తో తనకున్న పరిచయాన్ని బయటపెట్టాడు స్కాట్లాండ్ కెప్టెన్ కైల్ కోట్జర్. భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు ఎంపికైన సందర్భంగా 18 ఏళ్ల కిందట చోటు చేసుకున్న ఓ సంఘటనను తాజాగా గుర్తుచేసుకున్నాడు. అది 2003. అప్పటికే రాహుల్ ద్రవిడ్ దిగ్గజ బ్యాటర్. టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా పని చేశాడు. అలాంటి రాహుల్ కౌంటీల్లో స్కాటిష్ సాల్టైర్స్ జట్టుకు ఆడాడు. 2003లో జరిగిన టోర్నమెంట్లో రాహుల్‌తో కుర్రాడైన కైల్ కోట్జర్ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అప్పటికి కోట్జర్కు 19 ఏళ్లే. నార్త్థాంప్టన్తో మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ శతకం (114) చేశాడు. పాపం కోట్జర్ మాత్రం తొలి బంతికే వెనుదిరిగాడు. తొలి బంతిని ఎదుర్కొన్న కోట్జర్ పరుగు తీసేందుకు యత్నించి రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇప్పుడు మళ్లీ టీమ్ఇండియాతో మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆ విషయాన్ని పంచుకున్నాడు. ‘‘రాహుల్ ఎంతో వినయవిధేయత కలిగిన వ్యక్తి. ఆటగాళ్లందరితో చాలా బాగా మాట్లాడేవాడు. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి’’ అని చెప్పాడు.
ద్రవిడ్ కేవలం మూడు నెలల అగ్రిమెంట్‌ను మాత్రమే స్కాట్లాండ్ కౌంటీతో చేసుకున్నాడు. పదకొండు మ్యాచుల్లో 60కి పైగా సగటుతో దాదాపు 600కి పైగా పరుగులు చేశాడు. అయినప్పటికీ ఆ సీజన్లో స్కాట్లాండ్ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ‘‘రాహుల్, నేను రనౌట్‌లో భాగస్వాములం. అందులో ద్రవిడ్ కాకుండా నేను రనౌట్ అయ్యాను. అయితే అది మంచిదే అనుకుంటున్నా. అప్పటికే స్కాటిష్ జట్టుకు ద్రవిడ్ కీలక ఆటగాడు. మేము అనుకున్న విధంగానే చాలా బాగా ఆడాడు. జట్టుకు అవసరమైన పరుగులు సాధించాడు. నాకు ఇప్పటికీ ఆ సంఘటన గుర్తే. ‘నో’ అనే పదం అటువైపు (ద్రవిడ్ నుంచి) వచ్చింది. వెనక్కి వెళ్లమని సంకేతం వచ్చింది. అయినా దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యా’’ అని కోట్జర్ చెప్పుకొచ్చాడు.