IND vs SA : వారిద్దరిలో ఒకరు ఉండాల్సిందే.. చిన్నపాటి మార్పులు అవసరం

భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇవాళ కీలకమైన రెండో వన్డే మ్యాచ్‌...

Updated : 21 Jan 2022 12:02 IST

టీమ్‌ఇండియా తుది జట్టుపై దినేశ్‌ కార్తిక్, సంజయ్‌, ఆకాశ్ చోప్రా విశ్లేషణ

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇవాళ కీలకమైన రెండో వన్డే మ్యాచ్‌ జరగనుంది. తొలి వన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్‌ రేసులో నిలబడాలని కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలోని టీమ్‌ఇండియా భావిస్తుండగా.. వరుసగా రెండో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని సఫారీలు ఉవ్విళ్లూరుతున్నారు. తొలి వన్డేలో శిఖర్‌ ధావన్‌, విరాట్ కోహ్లీ, శార్దూల్‌ ఠాకూర్‌ అర్ధ శతకాలతో రాణించినా భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో మ్యాచ్‌ గెలవాలంటే టీమ్‌ఇండియా తుది జట్టులో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీనియర్‌ క్రికెటర్‌ దినేశ్ కార్తిక్, మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డారు.

దినేశ్ కార్తిక్‌ మాట్లాడుతూ.. ‘‘భారత పేస్‌ దళంలో మార్పులు చేయాలి. ప్రసిధ్‌ కృష్ణ లేదా మహమ్మద్‌ సిరాజ్‌.. వారిద్దరిలో ఒకరు తుది జట్టులో ఉండాలి. బుమ్రాకి విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నారా.. లేదా భువనేశ్వర్‌ను పక్కన పెడతారా అనేది మేనేజ్‌మెంట్ ఇష్టం. సిరాజ్‌, ప్రసిధ్‌లలో ఎవరైనా సరే పదకొండు మందిలో ఉండాల్సిందే. వీరు జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నా. మధ్య ఓవర్లలో తప్పకుండా వికెట్లను పడగొట్టగలరు’’ అని విశ్లేషించాడు.

భారత మిడిలార్డర్ బలోపేతం కావాలంటే చిన్నపాటి మార్పులు చేస్తే సరిపోతుందని సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఐదో స్థానంలో రిషభ్ పంత్‌, జట్టులో ఏ పాత్ర పోషిస్తున్నాడో తెలియని వెంకటేశ్ అయ్యర్‌ ఉండటం వల్ల టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ కాస్త బలహీనంగా ఉందనిపించింది. పొడిగా, మందకొడిగా ఉండే పిచ్‌పై ఓ యువ బ్యాటర్‌ ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు రావడం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే సూర్యకుమార్‌ యాదవ్ లాంటి వారికి చోటు కల్పిస్తే బాగుంటుంది. తర్వాత అశ్విన్‌కు ఏడో స్థానంలో అవకాశం కల్పించవచ్చు. అందుకే మిడిలార్డర్‌ పటిష్ఠంగా ఉండాలంటే చిన్నచిన్న మార్పులు చేయాలి’’ అని సంజయ్‌ వివరించాడు.

పక్కన పెట్టాల్సిన అవసరం లేదు

అరంగేట్రం చేసిన తొలి వన్డేలో వెంకటేశ్‌ అయ్యర్ (2) ఘోరంగా విఫలమయ్యాడు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో వెంకటేశ్‌ను పక్కన పెట్టేసి సూర్యకుమార్‌ను తీసుకోవాలని వాదనా వచ్చింది. అయితే క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా మాత్రం వెంకటేశ్‌ అయ్యర్‌కు మద్దతుగా నిలిచాడు. అయ్యర్‌కు కొంత సమయం ఇవ్వాలని సూచించాడు. అదే విధంగా శ్రేయస్‌ స్థానంలోనైనా ఎస్‌కే యాదవ్‌ను తీసుకోవాలంటే దానికి కూడా వద్దని చెబుతానని పేర్కొన్నాడు. శ్రేయస్‌తో సహా చాలా మందిపై బౌన్సర్లను సంధించి సఫారీల బౌలర్లు వికెట్లు పడగొట్టారని వివరించాడు. మొదటి మ్యాచ్‌లో వెంకటేశ్‌ సరిగా ఆడలేదు కాబట్టి.. రెండో మ్యాచ్‌లోనూ రిప్లేస్‌ చేయాల్సిన అవసరం లేదని ఆకాశ్ వివరించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని