Team India: వీళ్లని పంపే ఆలోచన లేనట్లుంది! 

గాయపడ్డ శుభ్‌మన్‌గిల్‌ స్థానంలో యువ ఓపెనర్లు పృథ్వీషా, దేవ్‌దత్‌ పడిక్కల్‌ను ఇంగ్లాండ్‌కు పంపాలని టీమ్‌ఇండియా అభ్యర్థించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై భారత సెలెక్షన్‌ కమిటి పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే సెలెక్షన్‌ కమిటి ఛైర్మన్‌ చేతన్‌ శర్మ

Published : 05 Jul 2021 23:17 IST

పృథ్వీ, దేవ్‌దత్‌ కోసం కోహ్లీసేన అభ్యర్థన..

ఇంటర్నెట్‌డెస్క్‌: గాయపడ్డ శుభ్‌మన్‌గిల్‌ స్థానంలో యువ ఓపెనర్లు పృథ్వీషా, దేవ్‌దత్‌ పడిక్కల్‌ను ఇంగ్లాండ్‌కు పంపాలని టీమ్‌ఇండియా అభ్యర్థించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై భారత సెలెక్షన్‌ కమిటి పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే సెలెక్షన్‌ కమిటి ఛైర్మన్‌ చేతన్‌ శర్మ ఇప్పటివరకు దానిపై స్పందించలేదు. ఈ విషయంపై తాజాగా ఓ బీసీసీఐ అధికారి పీటీఐతో మాట్లాడారు.

‘శుభ్‌మన్‌గిల్‌ కాళ్ల నొప్పుల కారణంగా పూర్తి ఇంగ్లాండ్‌ పర్యటనకు దూరమయ్యాడు. అతడు కోలుకోవడానికి మూడు నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే మరో ఇద్దరు ఓపెనర్లు (పృథ్వీ, పడిక్కల్‌) కావాలని టీమ్‌ఇండియా మేనేజర్‌ గతనెల చివర్లో సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌కు మెయిల్‌ చేశారు’ అని ఆ అధికారి చెప్పారు. అయితే, దీనిపై శర్మ స్పందించకపోవడం గమనార్హం. అలాగే ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీకి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఆ అధికారి పేర్కొన్నారు.

‘పృథ్వీ, పడిక్కల్‌ను ఇంగ్లాండ్‌కు పంపించాలనే అభ్యర్థనపై గంగూలీకి ఇప్పటివరకు ఎలాంటి అధికారి సమాచారం రాలేదు. ప్రస్తుతం పృథ్వీ, పడిక్కల్‌ శ్రీలంక పర్యటనలో ఉన్నారు. అక్కడ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు సిద్ధమవుతున్నారు. ఈనెల 26న లంక పర్యటన ముగిసిన తర్వాత వారు ఇంగ్లాండ్‌కు వెళ్లొచ్చు. అయితే, జులై 15న టీమ్‌ఇండియాను దుర్హమ్‌లో కలిసి బయోబుడగలోకి వెళ్లకముందే వారిద్దరూ తమతో ఉండాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది’ అని ఆయన వివరించారు.

ఒకవేళ టీమ్‌ఇండియా పృథ్వీ ఒక్కడినే కోరితే ఏం చేస్తారని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు. ‘మొదట వారిని అధికారికంగా మెయిల్‌ చేయనివ్వండి. కానీ, పృథ్వీ ఇప్పుడు లంక పర్యటనలో పూర్తిగా లీనమయ్యాడు. అక్కడ ఆడే పరిమిత ఓవర్ల క్రికెట్‌పైనే దృష్టి సారించాడు. మరోవైపు ఇంగ్లాండ్‌లో ఇప్పటికే 23 మంది ఆటగాళ్లు ఉన్నారు. అందులో అభిమణ్యు ఈశ్వరన్‌ను పక్కనపెట్టినా ముగ్గురు స్పెషలిస్టు ఓపెనర్లు ఉన్నారు. అయితే, అభిమణ్యును పృథ్వీతో పోల్చిచూడలేము. ఎందుకంటే పృథ్వీ ఎంతో నైపుణ్యం కలిగిన ఆటగాడు. అతడు ఇప్పటికే టెస్టుల్లో శతకం బాదాడు. ఇటీవలి కాలంలోనూ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడిని ముందే లంక పర్యటనకు కాకుండా ఇంగ్లాండ్‌కు ఎంపికచేయాల్సింది’ అని ఆ అధికారి చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని