Shikhar Dhawan: వన్డే క్రికెటర్‌గా ధావన్‌కు సరైన గుర్తింపు రాలేదు: బ్యాటింగ్‌ మాజీ కోచ్‌

శిఖర్ ధావన్‌.. వన్డేల్లో కీలక ఆటగాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కానీ అతడికి రావాల్సినంత గుర్తింపు మాత్రం రాలేదని టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ అభిప్రాయపడ్డాడు.

Published : 06 Oct 2022 18:38 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ఫార్మాట్‌లో టీమ్‌ఇండియాకు కీలకంగా మారిన శిఖర్ ధావన్‌కు సరైన గుర్తింపు రాలేదని బ్యాటింగ్‌ మాజీ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ పేర్కొన్నాడు. వన్డేల్లో స్థిరంగా రాణించే సామర్థ్యం కలిగిన బ్యాటర్లలో ధావన్‌ ముందుంటాడని తెలిపాడు. ప్రస్తుత ఏడాదిలో 14 వన్డేలను ఆడిన శిఖర్ 50కిపైగా సగటుతో పరుగులు చేయడం విశేషం. తాజాగా దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు భారత కెప్టెన్‌గా ధావన్‌ బాధ్యతలు చేపట్టాడు. కానీ టెస్టుల్లో, టీ20ల్లో స్థానం దక్కించుకోవడంలో విఫలమవుతున్నాడు. అయితే తన లక్ష్యం మాత్రం వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో రాణించడమేనని తాజాగా ధావన్‌ చెప్పాడు. ఈ క్రమంలో సంజయ్‌ బంగర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. 

‘‘వన్డే క్రికెటర్‌గా శిఖర్ ధావన్‌కు సరైన గుర్తింపు రాలేదు. భారత్‌ కోసం టాప్‌ స్థానంలో ఆడిన లెఫ్ట్‌ ఆర్మ్‌ బ్యాటర్లు సౌరభ్ గంగూలీ ముందుంటాడు.  గౌతమ్ గంభీర్‌ కూడా ఉన్నాడు. మరి వీరిద్దరి తర్వాత ఆ స్థానం ఎవరిది? సుస్థిరంగా ఆడుతున్న శిఖర్ ధావన్‌ కంటే మరొకరు ఉండరని నా అభిప్రాయం. అతడితో కలిసి పనిచేసిన అనుభవం నాకుంది. గతంలో జరిగిన విషయాలకు ఎప్పుడూ బాధపడడు. అదీ అతడి మనస్తత్వం. తన వద్ద ఉన్నదానికి చాలా విలువనిస్తాడు. ప్రస్తుతం వన్డే క్రికెట్‌ కోసం కష్టపడుతున్నాడు. వీటన్నింటి కలయికతో ఉత్తమ వ్యక్తిత్వం సొంతం చేసుకొన్నాడు’’ అని బంగర్ వివరించాడు. శిఖర్‌ ధావన్‌ ఇప్పటి వరకు 158 మ్యాచుల్లో 45 యావరేజీతో 6,647 పరుగులు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని