Virat Kohli: కోహ్లీ అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు: అక్తర్‌

అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొని పూర్తిస్థాయి బ్యాట్స్‌మెన్‌గా మారిన టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీకి పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ మద్దతుగా నిలిచాడు....

Published : 24 Jan 2022 02:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొని పూర్తిస్థాయి బ్యాట్స్‌మెన్‌గా మారిన టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీకి పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ మద్దతుగా నిలిచాడు. కెప్టెన్సీ విషయంలో తలెత్తిన ఇబ్బందికర పరిస్థితుల్ని పక్కనపెట్టి ఆటపై దృష్టి సారించాలని హితవు పిలికాడు. కెప్టెన్సీ అంత సులువైన విషయం కాదని.. తీవ్ర ఒత్తిడి మధ్య బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపాడు. ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయని.. కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టే అవకాశం దక్కిందని పేర్కొన్నాడు.

కోహ్లీ గొప్ప ఆటగాడని.. క్రికెట్‌ని ఎంజాయ్‌ చేస్తూ ఆడగలిగితే మరింత రాణిస్తాడని అక్తర్‌ చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీ వివాదంలోనే చిక్కుకుపోకుండా వాటన్నింటినీ మరచిపోవాలని సూచించాడు. రానున్న ఆరునెలల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే.. కెప్టెన్సీని వదులుకున్నందుకు ప్రతిఫలం దక్కినట్లేనని వ్యాఖ్యానించాడు. అలాగే 120 అంతర్జాతీయ శతకాలు సాధించగలనన్న విశ్వాసం తనలో వస్తుందని చెప్పాడు.

కొహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తీరుపై అక్తర్‌ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. కోహ్లీకి వ్యతిరేకంగా కొంతమంది వ్యవహారాలు నడిపారని ఆరోపించాడు. అందుకే అతను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. క్రికెట్‌లో స్టార్‌ స్టేటస్‌ ఉన్నవాళ్లకు ఇబ్బందులు తప్పవన్నాడు. దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించాడు. దేనికీ బెదరకుండా ఆటను ఆస్వాదించాలని హితవు పలికాడు. యావత్తు దేశం కోహ్లీని ప్రేమిస్తోందని గుర్తుచేశాడు! అయితే, కొన్ని సార్లు ఇటువంటి పరీక్షలు తప్పవని.. వాటి నుంచి ధైర్యంగా బయటకు రావాలని సూచించాడు.

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు జరిగిన విలేకర్ల సమావేశంలో వన్డే కెప్టెన్సీ పై విరాట్ ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీ20 సారథ్య బాధ్యతలను వదులుకోవద్దని ఎవరూ చెప్పలేదని, వన్డే కెప్టెన్‌గా తొలగిస్తున్నట్లు కేవలం గంటన్నర ముందు మాత్రమే సమాచారం ఇచ్చారని పేర్కొన్నాడు. కెప్టెన్సీ వదులుకోవద్దంటూ కోహ్లీతో తాను మాట్లాడానని అంతకుముందు గంగూలీ చేసిన ప్రకటనకు ఇది పూర్తిగా విరుద్ధం. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. ఫలితంగా గంగూలీ ఒకానొక దశలో విరాట్‌ కోహ్లీకి షోకాజ్‌ నోటీసులు పంపేందుకు సిద్ధమయ్యాడని వార్తలు గుప్పుమన్నాయి. అయితే, బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయం పెద్దది కాకుండా ఆపాడని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో గంగూలీ స్పందించడంతో వివాదానికి ముగింపు పలికినట్లైంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌ కెప్టెన్సీకీ గుడ్‌బై చెప్పేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని