సమర్పయామి

ఒక దశ వరకు ఆధిపత్యం మనదే ఉంటుంది. విజయం ఖాయమనిపిస్తుంది. కానీ చివరికి చూస్తే ఫలితం మారిపోతుంది. కీలక దశల్లో పట్టు కోల్పోయి మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించేస్తుంది టీమ్‌ఇండియా. దక్షిణాఫ్రికా పర్యటనను గొప్ప విజయంతో ఆరంభించాక.. తర్వాతి మ్యాచ్‌ నుంచి ఇదే వరస! టెస్టుల్లో గెలుపు అవకాశాల్ని ఒడిసిపట్టలేక సిరీస్‌ కోల్పోయిన భారత్‌.. వన్డేల్లోనూ అదే ఫలితాన్నందుకుంది. తొలి వన్డేలో మాదిరే ఒక దశలో తిరుగులేని స్థితిలో నిలిచి, ఉన్నట్లుండి తడబడ్డ భారత్‌.. ఇక...

Updated : 22 Jan 2022 09:38 IST

పంత్‌ మెరిసినా.. బౌలర్లు విఫలం
రెచ్చిపోయిన డికాక్‌, మలన్‌
రెండో వన్డేలోనూ భారత్‌ ఓటమి
సిరీస్‌ 2-0తో దక్షిణాఫ్రికా వశం

పార్ల్‌

ఒక దశ వరకు ఆధిపత్యం మనదే ఉంటుంది. విజయం ఖాయమనిపిస్తుంది. కానీ చివరికి చూస్తే ఫలితం మారిపోతుంది. కీలక దశల్లో పట్టు కోల్పోయి మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించేస్తుంది టీమ్‌ఇండియా. దక్షిణాఫ్రికా పర్యటనను గొప్ప విజయంతో ఆరంభించాక.. తర్వాతి మ్యాచ్‌ నుంచి ఇదే వరస! టెస్టుల్లో గెలుపు అవకాశాల్ని ఒడిసిపట్టలేక సిరీస్‌ కోల్పోయిన భారత్‌.. వన్డేల్లోనూ అదే ఫలితాన్నందుకుంది. తొలి వన్డేలో మాదిరే ఒక దశలో తిరుగులేని స్థితిలో నిలిచి, ఉన్నట్లుండి తడబడ్డ భారత్‌.. ఇక పుంజుకోలేకపోయింది. పంత్‌ మెరుపులతో 350 లక్ష్యం నిలిపేలా కనిపించిన మన జట్టు.. చివరికి 287 స్కోరుతో సరిపెట్టుకుంది. బౌలర్లు సత్తా చాటితే ప్రత్యర్థికి ఛేదన కష్టమయ్యేదే. కానీ బౌలింగ్‌ పూర్తిగా తేలిపోవడంతో భారత్‌కు పరాభవం తప్పలేదు. లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకుంది ఆతిథ్య జట్టు.

తొలి వన్డేలో దక్షిణాఫ్రికా స్కోరు 296. దాన్ని ఛేదించలేక భారత్‌ చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌ జరిగిన మైదానంలోనే రెండో వన్డేలో టీమ్‌ఇండియా అంతకంటే 9 పరుగులే తక్కువ చేసింది. కానీ ఈ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 11 బంతులుండగానే కేవలం 3 వికెట్లే కోల్పోయి అలవోకగా ఛేదించింది. ప్రత్యర్థి జట్టు 49వ ఓవర్లో విజయాన్నందుకున్నప్పటికీ.. ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌ (78; 66 బంతుల్లో 7×4, 3×6), జానెమన్‌ మలన్‌ (91; 108 బంతుల్లో 8×4, 1×6) దూకుడుతో చాలా ముందే ఆ జట్టు విజయం ఖరారైపోయింది. వీరి తర్వాత బవుమా (35; 36 బంతుల్లో 3×4), మార్‌క్రమ్‌ (37 నాటౌట్‌; 41 బంతుల్లో 4×4), వాండర్‌డసెన్‌ (37 నాటౌట్‌; 38 బంతుల్లో 2×4) మిగతా పని పూర్తి చేశారు. మొదట రిషబ్‌ పంత్‌ (85; 71 బంతుల్లో 10×4, 2×6), కేఎల్‌ రాహుల్‌ (55; 79 బంతుల్లో 4×4), శార్దూల్‌ ఠాకూర్‌ (40 నాటౌట్‌; 38 బంతుల్లో 3×4, 1×6) రాణించడంతో భారత్‌ 6 వికెట్లకు 287 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో షంసి (2/57) మెరిశాడు. డికాక్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. నామమాత్రమైన చివరి వన్డే ఆదివారం జరుగుతుంది.

ఆశే లేదు..: మొదట భారత్‌ అనుకున్నంత స్కోరు చేయలేకపోయినా.. లక్ష్యం మరీ చిన్నదేమీ కాకపోవడంతో భారత బౌలర్ల మీద నమ్మకంతోనే ఉన్నారు అభిమానులు. కానీ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ దూకుడు, మన వాళ్ల బౌలింగ్‌ చూస్తే ఏ దశలోనూ భారత్‌ గెలుస్తుందన్న ఆశే కలగలేదు. బౌలర్లకు కుదురుకునే అవకాశమే ఇవ్వకుండా ఓపెనర్‌ డికాక్‌.. వారిపై ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగాడు. ఫామ్‌లో లేని భువనేశ్వర్‌ను అతను లెక్కే చేయలేదు. బుమ్రా బౌలింగ్‌లోనూ దూకుడుగానే ఆడాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో స్టంపింగ్‌ ప్రమాదం తప్పించుకోవడంతో డికాక్‌కు ఇక ఎదురే లేకపోయింది. 10 ఓవర్లకు దక్షిణాఫ్రికా 66 పరుగులు చేస్తే అందులో అతడి వాటానే 46. 36 బంతుల్లోనే అతడి అర్ధశతకం పూర్తయింది. మరో ఎండ్‌లో ఆచితూచి ఆడుతూ వచ్చిన మలన్‌ కూడా తర్వాత జోరందుకున్నాడు. దీంతో 16వ ఓవర్లోనే దక్షిణాఫ్రికా 100 మార్కును దాటేసింది. 20 ఓవర్లకు స్కోరు 122/0. రాహుల్‌ ఎన్ని బౌలింగ్‌ మార్పులు చేసినా ఓపెనర్లను ఇబ్బంది పెట్టలేకపోయాడు. పూర్తిగా ఆశలు కోల్పోయిన దశలో శార్దూల్‌ అదృష్టం కొద్దీ తొలి వికెట్‌ పడింది. అతడి ఫుల్‌టాస్‌ బంతికి డికాక్‌ షాట్‌ ఆడబోతే తప్పి, బంతి ప్యాడ్‌కు తాకి ఎల్బీ అయ్యాడు. సమీక్షలో భారత్‌ ఈ వికెట్‌ సాధించింది. డికాక్‌ అప్పటికే చేయాల్సిన నష్టమంతా చేసేయగా.. మలన్‌, బవుమా కలిసి ప్రశాంతంగా ఆడుకుంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. 34 ఓవర్లకు దక్షిణాఫ్రికా 211/1తో నిలిచింది. సెంచరీ చేసేలా కనిపించిన మలన్‌.. బుమ్రా బంతిని వికెట్ల మీదికి ఆడుకుని వెనుదిరగ్గా, బవుమాను చాహల్‌ రిటర్న్‌ క్యాచ్‌తో ఔట్‌ చేశాడు. కానీ సమీకరణం తేలికైపోవడంతో దక్షిణాఫ్రికా ఏమాత్రం ఒత్తిడికి గురి కాలేదు. మార్‌క్రమ్‌, వాండర్‌డసెన్‌ నిలకడగా ఆడి లాంఛనాన్ని పూర్తి చేశారు.

అతనున్నంతసేపూ..: మొదట భారత ఇన్నింగ్స్‌ను.. రిషబ్‌ పంత్‌ క్రీజులోకి రావడానికి ముందు, అతనొచ్చాక, అతను ఔటయ్యాక.. ఇలా మూడు భాగాలుగా విభజించి చూడాలి. పంత్‌ వచ్చే సమయానికి భారత్‌ స్కోరు 12.4 ఓవర్లలో 64/2. అంతకుముందే భారత్‌కు ఒక్క పరుగు తేడాలో రెండు షాక్‌లు తగిలాయి. తొలి వన్డేలో తీవ్రంగా నిరాశ పరిచిన కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఈ మ్యాచ్‌లో నిలకడగా ఆడటం, ధావన్‌ (29) జోరు కొనసాగించడంతో 11 ఓవర్లకు 58/0తో మంచి స్థితిలో నిలిచింది భారత్‌. అంతా సాఫీగా సాగిపోతున్న ఈ దశలో భారత్‌ రెండు ఓవర్ల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తొలి వన్డేలో రాహుల్‌ను ఔట్‌ చేసి భారత్‌ను దెబ్బ కొట్టిన పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ మార్‌క్రమ్‌.. ఈసారి ధావన్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. అతడి బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి ధావన్‌ మిడ్‌వికెట్లో దొరికిపోయాడు. తర్వాతి ఓవర్లో తగిలింది ఇంకా పెద్ద షాక్‌. తొలి వన్డేలో అర్ధశతకంతో మంచి ఊపు మీద కనిపించిన విరాట్‌.. ఈసారి మూడంకెల స్కోరు ముచ్చట తీర్చుకుంటాడనుకుంటే, కనీసం ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్‌ చేరిపోయాడు. నాలుగు బంతులు ఆచితూచి ఆడిన కోహ్లి.. అయిదో బంతికి కేశవ్‌ బౌలింగ్‌లో కవర్‌ డ్రైవ్‌ ఆడబోయి బవుమాకు దొరికిపోయాడు. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ ఆత్మరక్షణలో పడుతుందనుకుంటే.. పంత్‌ ఎదురుదాడితో పరిస్థితిని పూర్తిగా మార్చేశాడు. రెండు మూడు ఓవర్లు ఆచితూచి ఆడిన పంత్‌.. 3 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి కోహ్లి వికెట్‌ తీసిన కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది తన మార్కు బ్యాటింగ్‌ మొదలుపెట్టాడు. ఇక అక్కడి నుంచి బౌండరీల మోత మోగుతూ సాగింది. షంసి వేసిన ఒక ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన పంత్‌.. 44 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించాడు. షంసి బౌలింగ్‌లోనే అతను కొట్టిన ఒక సిక్సర్‌కు బంతి మైదానం అవతల పడింది. రాహుల్‌ కూడా అడపాదడపా షాట్లు ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అతను 71 బంతుల్లో 50 మార్కు దాటాడు. 31 ఓవర్లకు 179/2తో భారత్‌ పటిష్ట స్థితిలో నిలిచింది.

మళ్లీ 2 ఓవర్లలో 2..: పంత్‌, రాహుల్‌ ఉన్న ఊపు చూస్తే భారత్‌ 350 చేసేలా కనిపించింది. కానీ మరోసారి వరుస ఓవర్లలో భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి కష్టాలు కొని తెచ్చుకుంది. ముందుగా రాహుల్‌ను మగలా.. తర్వాత పంత్‌ను షంసి ఔట్‌ చేశారు. ఇక్కడి నుంచి ఇన్నింగ్స్‌ లయ తప్పింది. శ్రేయస్‌ అయ్యర్‌ (11), వెంకటేశ్‌ అయ్యర్‌ (22; 33 బంతుల్లో 1×6) క్రీజులో కుదురుకోవడానికి చాలా కష్టపడ్డారు. శ్రేయస్‌ అంత కష్టపడీ మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. వెంకటేశ్‌ కుదురుకున్నట్లే కనిపించినా.. పేసర్‌ ఫెలుక్వాయో బౌలింగ్‌లో రెప్పపాటులో డికాక్‌ చేసిన చేసిన మెరుపు స్టంపింగ్‌కు వెనుదిరగాల్సి వచ్చింది. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా వెనుదిరిగినా.. భారత్‌ 287 పరుగులు చేసిందంటే.. శార్దూల్‌, అశ్విన్‌ (25 నాటౌట్‌; 24 బంతుల్లో 1×4, 1×6)ల చలవే. వీళ్లిద్దరూ టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో చక్కటి షాట్లు ఆడుతూ చివరి ఓవర్లలో అనుకున్న దాని కంటే ఎక్కువ పరుగులే రాబట్టారు. అభేద్యమైన ఏడో వికెట్‌కు ఈ జోడీ 37 బంతుల్లో 47 పరుగులు జోడించింది.

భారత ఇన్నింగ్స్‌ సందర్భంగా దక్షిణాఫ్రికా జట్టులో బౌలింగ్‌ చేసిన ఆరుగురిలో ఎవ్వరూ పది ఓవర్ల కోటా పూర్తి చేయలేదు. వన్డేల్లో ఇలా జరగడమిది 18వసారి.


పంత్‌.. ప్లస్సు మైనస్సు

మొదట భారత ఇన్నింగ్స్‌లో మెరుపు బ్యాటింగ్‌తో జట్టును తిరుగులేని స్థితికి తీసుకొచ్చిన పంత్‌.. తర్వాత దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో పెద్ద తప్పిదంతో పరోక్షంగా ఓటమికి కారణమయ్యాడు. ఆరంభంలోనే ఎదురుదాడితో భారత బౌలర్ల లయను దెబ్బ తీసిన డికాక్‌.. 32 పరుగులకే వెనుదిరగాల్సింది. ఎనిమిదో ఓవర్లో అశ్విన్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్‌ ఆడబోగా.. బంతి చిక్కలేదు. కానీ పంత్‌ దాన్ని అందుకుని స్టంపింగ్‌ చేయలేకపోయాడు. తర్వాత డికాక్‌ వేగంగా మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా వైపు మళ్లించేశాడు. పంత్‌ ఆ స్టంపింగ్‌ చేసి ఉంటే కథ వేరుగా ఉండేదేమో.


భారత్‌ ఇన్నింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ (సి) వాండర్‌డసెన్‌ (బి) మెగాలా 55; ధావన్‌ (సి) మెగాలా (బి) మార్‌క్రమ్‌ 29; కోహ్లి (సి) బవుమా (బి) కేశవ్‌ 0; పంత్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) షంసి 85; శ్రేయస్‌ ఎల్బీ (బి) షంసి 11; వెంకటేశ్‌ (స్టంప్డ్‌) (బి) ఫెలుక్వాయో 22; శార్దూల్‌ నాటౌట్‌ 40; అశ్విన్‌ నాటౌట్‌ 25; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం: (50 ఓవర్లలో 6 వికెట్లకు) 287
వికెట్ల పతనం: 1-63, 2-64, 3-179, 4-183, 5-207, 6-239
బౌలింగ్‌: ఎంగిడి 8-0-35-0; మెగాలా 8-0-64-1; మార్‌క్రమ్‌ 8-0-34-1; కేశవ్‌ 9-0-52-1; ఫెలుక్వాయో 8-0-44-1; షంసి 9-0-57-2
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: మలన్‌ (బి) బుమ్రా 91; డికాక్‌ ఎల్బీ (బి) శార్దూల్‌ 78; బవుమా (సి) అండ్‌ (బి) చాహల్‌ 35; మార్‌క్రమ్‌ నాటౌట్‌ 37; వాండర్‌డసెన్‌ నాటౌట్‌ 37; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (48.1 ఓవర్లలో 3 వికెట్లకు) 288
వికెట్ల పతనం: 1-132, 2-212, 3-214
బౌలింగ్‌: బుమ్రా 10-0-37-1; భువనేశ్వర్‌ 8-0-67-0; అశ్విన్‌ 10-1-68-0; చాహల్‌ 10-0-47-1; శార్దూల్‌ 5-0-35-1; వెంకటేశ్‌ 5-0-28-0; శ్రేయస్‌ 0.1-0-1-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని