ఆమె కొడితే గోల్‌ పోస్టులోకే..

ఫుట్‌బాల్‌లో తెలుగు క్రీడాకారుల ప్రాతినిధ్యం తీరను లోటుగానే మిగిలిపోయింది. పాతికేళ్లుగా ఒక్క క్రీడాకారిని జాతీయ జట్టులో చోటుదక్కించుకోలేకపోయింది. కాగా ఆ కలను నెరవేరుస్తూ.. ఆ నిరీక్షణకు తెరదించుతూ తెలుగు ప్రజల....

Published : 12 Feb 2021 13:52 IST

తెలుగు ప్రజల కలను సాకారం చేసిన నిజామాబాద్‌ క్రీడాకారిణి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫుట్‌బాల్‌లో తెలుగు క్రీడాకారుల ప్రాతినిధ్యం తీరని లోటుగానే మిగిలిపోయింది. పాతికేళ్లుగా ఒక్క క్రీడాకారిణి జాతీయ జట్టులో చోటుదక్కించుకోలేకపోయింది. కాగా ఆ కలను నెరవేరుస్తూ.. ఆ నిరీక్షణకు తెరదించుతూ తెలుగు ప్రజల కలను సాకారం చేసింది నిజామాబాద్‌ యువతి. రెంజల్‌ మండలం కూనేపల్లి కృష్ణ తండాకు చెందిన సౌమ్య జాతీయ ఫుట్‌బాల్‌ జట్టులో చోటు దక్కించుకుని సత్తా చాటింది. ఏడో తరగతిలో ఉన్నప్పుడు పాఠశాల స్థాయిలో జరిగే పరుగు పోటీలో సౌమ్య మెరుపు వేగంతో దూసుకెళ్లింది. ఆమె ప్రతిభను గుర్తించిన స్థానిక ఫుట్‌బాల్‌ కోచ్‌ నాగరాజు సౌమ్య తల్లిదండ్రులు గుగులోత్‌ గోపి, ధనలక్ష్మితో మాట్లాడారు. సౌమ్యను ఫుట్‌బాల్‌ శిక్షణకు పంపిస్తే గొప్ప క్రీడాకారిణి అవుతుందని చెప్పారు. అమ్మాయిలకు ఆటలెందుకని మొదట వారు నిరాకరించినా.. కోచ్‌ నచ్చజెప్పడంతో వారు ఒప్పుకొన్నారు.

2015లోనే అండర్‌-14 జాతీయ జట్టుకు ఎంపికైన సౌమ్య అప్పటినుంచి సీనియర్‌ జట్టులో స్థానం కోసం పట్టుదలతో ప్రయత్నించింది. చైనాలో జరిగిన అండర్‌-16 పోటీల్లో అత్యధిక గోల్స్‌ కొట్టి టాపర్‌గా నిలిచింది. తెలంగాణ ఉమెన్స్‌ లీగ్‌లోనూ ఆమె టాప్‌ స్కోరర్‌. గతేదాడి జాతీయస్థాయి ఉమెన్స్‌ లీగ్‌లో ముంబయి ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ క్యాంక్రీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. 2018లో బ్రిక్స్‌ దేశాల మధ్య జరిగిన జూనియర్‌ మహిళా ఫుట్‌బాల్‌ పోటీల్లోనూ జట్టు కెప్టెన్‌గా తన ప్రతిభేంటో నిరూపించుకుంది. 2022లో ఖతార్‌లో జరిగే ఆసియా కప్‌ టోర్నీకి పటిష్ఠమైన మహిళా జట్టును పంపించాలని భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య కసరత్తు ప్రారంభించింది. గోవాలో రెండున్నర నెలల పాటు శిక్షణా శిబిరం నడిపింది. ఇందులో స్ట్రైకర్‌గా సౌమ్య చక్కటి ప్రతిభ కనబరచడంతో తుది 20 మంది జట్టులో ఆమె స్థానం దక్కించుకొంది. ఈ జట్టు ఫిబ్రవరి 14 నుంచి టర్కీలో జరిగే టోర్నమెంట్‌లో పాల్గొననుంది.

దేశ ఫుట్‌బాల్‌ జట్టులో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలనుంచి ప్రాతినిధ్యం లేకపోగా సౌమ్య ఆ లోటును భర్తీ చేసింది. జాతీయ సీనియర్‌ జట్టులో చోటు దక్కించుకున్న తొలి తెలంగాణ క్రీడాకారిణిగా సౌమ్య రికార్డు సాధించింది. భవిష్యత్తులో జరగబోయే టోర్నమెంట్లలోనూ సౌమ్య రాణించాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి...

ఐపీఎల్‌ తుది జాబితాలో 292 మంది ఆటగాళ్లు
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని