Dhoni - Gavaskar: ధోనీ నిర్ణయం చాలా గొప్పది: గావస్కర్

చెన్నై సారథి మహేంద్రసింగ్‌ ధోనీ వచ్చే ఏడాది కూడా భారత టీ20 లీగ్‌ ఆడతానని స్పష్టం చేయడంతో అతడి అభిమానులు సంతోషంలో మునిగిపోయారు...

Updated : 21 May 2022 11:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సారథి మహేంద్రసింగ్‌ ధోనీ వచ్చే ఏడాది కూడా భారత టీ20 లీగ్‌ ఆడతానని స్పష్టం చేయడంతో అతడి అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇన్నేళ్లుగా చెన్నై టీమ్‌కు ఎంతో అండగా నిలిచిన అభిమానులకు సొంత మైదానంలో కృతజ్ఞతలు చెప్పకుండా వెళ్లడం మంచిది కాదని భావించి ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇప్పటికే ధోనీ వయసు 40 ఏళ్లు కావడంతో ఈ సీజనే చివరిది కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో గతరాత్రి స్పష్టతనిచ్చాడు. దీనిపై సునీల్‌ గావస్కర్‌ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశాడు.

‘ధోనీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. అతడు చెప్పినట్లు ఇన్నాళ్లూ తనని, తను నడిపించిన చెన్నై జట్టుని, ఆదరించిన అభిమానులకు వచ్చే ఏడాది సొంత మైదానంలో కృతజ్ఞతలు తెలియజేయాలనుకోవడం అభినందనీయం. అతడు కేవలం చెన్నైకే కాకుండా టీమ్‌ఇండియాకూ నాయకత్వం వహించాడు. భారత జట్టును అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. ఇక వచ్చే ఏడాది ఈ లీగ్‌ దేశవ్యాప్తంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రతి జట్టూ ఇంటా బయట మ్యాచ్‌లు ఆడే పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నా. ఇప్పుడు మొత్తం 10 జట్లు ఉండటంతో తర్వాతి సీజన్‌లో పది వేదికల్లోనూ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పి వీడ్కోలు పలకొచ్చు. దీంతో ఒకేసారి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు చెప్పినట్లు అవుతుంది’ అని గావస్కర్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని