T20 World Cup: అతడి కోసమైనా టీమిండియా ప్రపంచ కప్‌ కొట్టాలి: రైనా

టీ20 ప్రపంచకప్‌ పోటీల గురించి సురేశ్‌ రైనా అభిప్రాయాలు

Updated : 17 Oct 2021 21:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్‌) ముగిసింది. అంతర్జాతీయ టీ20 ప్రపంచకప్‌ జోరు మొదలైంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో 24న పాకిస్థాన్‌తో తలపడనుంది. చాలా ఏళ్ల తర్వాత భారత్, పాక్‌ జట్లు పోటీ పడనుండటంతో క్రికెట్‌ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా తన అభిప్రాయాలను వెల్లడించాడు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ కోసం వరల్డ్‌ కప్‌ను గెలవాలని ఆటగాళ్లకు సూచించాడు. ఈ మెగా టోర్నీ తర్వాత విరాట్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగనుండటంతో సురేశ్‌ రైనా ఈ మేరకు స్పందించాడు. కోహ్లీ కోసమైనా భారత ఆటగాళ్లు కసిగా ఆడాలని, ప్రపంచకప్‌ను సాధించి పెట్టాలని చెప్పాడు. భారత్‌కు పొట్టి ప్రపంచకప్‌ను అందించి తన సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ సగర్వంగా వీడ్కోలు చెప్పాలని రైనా పేర్కొన్నాడు.  

తొలి మ్యాచ్‌ పాక్‌తో హోరాహోరీగా ఉంటుందని సురేశ్‌ రైనా అంచనా వేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆటను చూసేందుకు భారత క్రీడాభిమానులు ఆసక్తి చూపుతున్నారు. మనకు మంచి ఆటగాళ్లు ఉన్నారు. గెలవాలనే ఉత్సాహం ఉంది. మన జట్టు చేయాల్సిందల్లా మైదానంలో ఆటను అమలు చేయడమే. మొన్నటి వరకు యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ మన క్రికెటర్లకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టే కప్‌ను గెలిచేందుకు టీమిండియాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది నా నమ్మకం. బ్యాటింగ్‌ ఆర్డర్‌లోని టాప్‌-3 ఆటగాళ్లు సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ కనీసం 15 ఓవర్లపాటు క్రీజ్‌లో ఉండి గట్టి పునాది అందివ్వాలి. ఆ తర్వాత మిడిలార్డర్‌లో రిషభ్‌ పంత్‌, హార్దిక్‌, జడేజా ఉండనే ఉన్నారు. పంత్‌ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఒకవేళ టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు నిలబడ్డారంటే ఎంతటి లక్ష్యాన్నైనా భారత్‌ ఛేదించగలదు’’ అని సురేశ్‌ రైనా అభిప్రాయపడ్డాడు.

మిస్టరీ స్పిన్నర్‌దే కీలక పాత్ర 

టీ20 ప్రపంచకప్‌ సాధించాలంటే కేవలం బ్యాటింగ్‌ ఉంటేనే సరిపోదు. బౌలింగ్‌ కూడా ఎంతో కీలకమే. భారత్‌కు భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రా, షమీ, శార్దూల్‌ ఠాకూర్‌,వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ వంటి బౌలర్లు ఉన్నారు. వీరిలో మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి పొట్టికప్‌లో కీలక పాత్ర పోషిస్తాడని సురేశ్‌ రైనా అభిప్రాయపడ్డాడు. ‘‘నా అనుభవం ప్రకారం యూఏఈ, ఒమన్‌ మైదానాల్లో మిస్టరీ స్పిన్నర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు కష్టమే. అందువల్లే వరుణ్‌ చక్రవర్తి టీమిండియా బౌలింగ్‌ దళంలో ముఖ్యభూమిక పోషిస్తాడు. స్పిన్‌తోపాటు పేస్‌ను ఉపయోగిస్తుంటాడు. వరుణ్‌ అంతర్జాతీయంగా కేవలం మూడు టీ20 మ్యాచ్‌లను ఆడినా.. ఐపీఎల్‌ అనుభవం ఎంతో పనికొస్తుంది’’ అని రైనా చెప్పుకొచ్చాడు. భువి అనుభవం జట్టుకు ఎంతో అక్కరకొస్తుందని తెలిపాడు. శార్దూల్‌ ఠాకూర్‌ టీంలో ఉండటం అదనపు బలమని సురేశ్‌ రైనా అంచనా వేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని