Sushil Kumar: ఉరి తీయాలని రాణా తల్లిదండ్రుల డిమాండ్‌

తమ కుమారుడి మృతికి కారణమైన రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ను ఉరితీయాలని సాగర్‌ రాణా తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. పోలీసులు కేసును న్యాయంగా దర్యాప్తు చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని అతడు తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తాడని ఆరోపించారు

Updated : 24 May 2021 12:31 IST

దిల్లీ: తమ కుమారుడి మృతికి కారణమైన రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ను ఉరితీయాలని సాగర్‌ రాణా తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. పోలీసులు కేసును న్యాయంగా దర్యాప్తు చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని అతడు తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తాడని ఆరోపించారు. అతడి వద్ద నుంచి పతకాలు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 

‘నా కొడుకును హత్య చేసిన వ్యక్తి మార్గనిర్దేశకుడిగా ఉండేందుకు అర్హుడు కాడు. సుశీల్‌ కుమార్‌ సాధించిన పతకాలన్నీ వెనక్కి తీసుకోవాలి. పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేస్తారని నమ్ముతున్నాం. కానీ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకునేందుకు సుశీల్‌ ప్రయత్నిస్తాడు. అతడిని ఉరితీయాలి’ అని సాగర్‌ రాణా తల్లి  అన్నారు.

నేరస్థులతో సుశీల్‌ సంబంధాలపై దర్యాప్తు చేయాలని సాగర్‌ తండ్రి అశోక్‌ కోరారు. ‘న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. పారిపోయినప్పుడు సుశీల్‌ ఎక్కడున్నాడు? అతడికి ఎవరు ఆశ్రయమిచ్చారు? గ్యాంగ్‌స్టర్లతో అతడికున్న సంబంధాలపై దర్యాప్తు చేయాలి. అతడిని ఉరి తీయాలి. తన సొంత విద్యార్థులనే చంపేవారికి అదో పాఠం కావాలి’ అని ఆయన అన్నారు.

యువ రెజ్లర్‌ సాగర్  హత్య జరిగిన నాటి నుంచి సుశీల్‌ తప్పించుకొని తిరిగిన సంగతి తెలిసిందే. దాంతో పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ఆచూకీ తెలియజేసిన వారికి రూ.లక్ష బహుమానం సైతం ప్రకటించారు. ఎట్టకేలకు ఆదివారం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని