సుశీల్‌కుమార్‌ ముందస్తు బెయిల్‌ తిరస్కరణ

ఒక రెజ్లర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఒలింపిక్‌ పతక విజేత సుశీల్‌ కుమార్‌కు దిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌ కోసం అతడు దరఖాస్తు చేసుకున్న పిటిషన్‌ను అక్కడి కోర్డు నిరాకరించింది...

Published : 18 May 2021 23:23 IST

దిల్లీ: ఒక రెజ్లర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఒలింపిక్‌ పతక విజేత సుశీల్‌ కుమార్‌కు దిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌ కోసం అతడు దరఖాస్తు చేసుకున్న పిటిషన్‌ను అక్కడి కోర్డు నిరాకరించింది. అసలేం జరిగిందంటే.. ఈనెల 4న దిల్లీలోని ఛత్రసాల్‌ స్టేడియం సమీపంలో సాగర్‌ దంకడ్‌ అనే యువ రెజ్లర్‌, అతడి స్నేహితులపై.. సుశీల్‌తో పాటు మరికొందరు రెజర్లు దాడి చేశారు. దాంతో సాగర్‌ మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే సుశీల్‌ పోలీసుల కంట పడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.

ఆ దాడికి పాల్పడిన మిగతా వారిని విచారించగా అందులో సుశీల్‌ హస్తం ఉన్నట్టు తెలిసింది. పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి అప్పటి నుంచీ అతడి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం పోలీసులు అతడిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ సైతం జారీ. దాంతో అరెస్టు విషయంలో భయపడిన కీలక నిందితుడు ముందస్తు బెయిల్‌ కోసం మంగళవారం రోహిణి కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ కేసును విచారించిన అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి జగదీశ్‌ కుమార్‌ దాన్ని తిరస్కరించారు.

సుశీల్‌ తన అభ్యర్ధనలో పోలీసుల దర్యాప్తులో పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. ఆరోజు అసలేం జరిగిందనే విషయంపై పూర్తి సమాచారం తెలియజేస్తానన్నాడు. దాడి సమయంలో జరిగిన కాల్పులతో తనకు ఎలాంటి సంబంధం లేదని, సంఘటన జరిగిన ప్రదేశంలో దొరికిన తుపాకీ, వాహనం తనవి కావన్నాడు. 
అయితే, పోలీసుల తరఫున వాదించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ.. ఆ సమయంలో సుశీల్‌ కర్రతో కొట్టడానికి సంబంధించిన బలమైన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు చెప్పారు. అతడు దేశం వదిలి పారిపోతాడనే నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసి సుశీల్ పాస్‌పోర్టును జప్తు చేశారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని