T20 World Cup: ‘టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరేది ఆ రెండు జట్లే’

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 12 దశలో సగం మ్యాచ్‌లు కూడా పూర్తి్కాకముందే ఫైనల్స్‌కు చేరే జట్లపై పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్‌ విశ్లేషకులు తమ అంచనాలను బయటపెడుతున్నారు. ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌

Published : 30 Oct 2021 22:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 దశలో సగం మ్యాచ్‌లు కూడా పూర్తి కాకముందే ఫైనల్స్‌కు చేరే జట్లపై పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్‌ విశ్లేషకులు తమ అంచనాలను బయటపెడుతున్నారు. ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ కూడా ఫైనల్స్‌కు చేరే జట్లపై తన అంచనాను బయటపెట్టాడు. గ్రూపు-1లో టాప్‌లో ఉన్న పాకిస్థాన్‌, గ్రూపు-2లో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌ ఈ సారి ఫైనల్స్‌కు చేరుతాయని జోస్యం చెప్పాడు.  ఈ మేరకు ‘ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ జట్లను ఫైనల్‌లో చూస్తామా?’ అని స్టోక్స్‌ ట్వీట్‌ చేశాడు.

ఇక అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు సిక్స్‌లు బాదిన పాకిస్థాన్‌ ఆటగాడు అసిఫ్ అలీని స్టోక్స్‌ మెచ్చుకున్నాడు. ‘అసిఫ్‌ అలీ పేరును గుర్తుంచుకోండి’ అంటూ మరో ట్వీట్ చేశాడు. మానసిక ఆరోగ్యం, గాయం నుంచి కోలుకోవడం కోసం స్టోక్స్‌ జులై నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ కారణంగానే భారత్‌తో టెస్టు సిరీస్‌, టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమైన సంగతి తెలిసిందే.

బెన్‌స్టోక్స్‌ ఫైనల్స్‌కు చేరుతాయని అంచనా వేసిన పాక్‌, ఇంగ్లాండ్ జట్లు ఇప్పటికే ఈ టీ20 ప్రపంచకప్‌లో అదరగొడుతున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ జట్టు ఎన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో ఆడుతూ వరుస విజయాలతో దూసుకుపోతోంది. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో రాణిస్తూ ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తోంది. టీమిండియాపై 10 వికెట్ల తేడాతో నెగ్గిన ఆ జట్టు.. న్యూజిలాండ్‌పై 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. శుక్రవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్‌ బెర్త్‌ని దాదాపు ఖాయం చేసుకుంది. మరోవైపు, గ్రూపు-1లోని ఇంగ్లాండ్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపు మీదుంది. తమ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన ఆ మోర్గాన్‌ సేన.. బంగ్లాదేశ్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా కూడా రెండు విజయాలు సాధించి రెండో స్థానంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని