T20 World Cup: నన్ను ప్రశాంతంగా ఉంచే ఏకైక వ్యక్తి ధోని భాయ్‌ : హార్దిక్‌ పాండ్య

ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తనను ప్రశాంతంగా ఉంచే ఏకైక వ్యక్తి ధోని అని ఆల్‌-రౌండర్ హార్దిక్‌ పాండ్య తెలిపాడు. తన కెరీర్లో ఎన్నో సందర్బాల్లో ధోని భాయ్ అండగా నిలిచాడని పాండ్య పేర్కొన్నాడు. టీమిండియా మాజీ సారథి..

Published : 18 Oct 2021 23:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తనను ప్రశాంతంగా ఉంచే ఏకైక వ్యక్తి ధోని అని ఆల్‌-రౌండర్ హార్దిక్‌ పాండ్య తెలిపాడు. తన కెరీర్లో ఎన్నో సందర్బాల్లో ధోని భాయ్ అండగా నిలిచాడని పాండ్య పేర్కొన్నాడు. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత జరుగుతున్న తొలి టీ20 ప్రపంచకప్‌లో.. ఫినిషర్‌గా తనపై మరింత బాధ్యతలు పెరిగాయని అన్నాడు. ఇంతకు ముందు ధోని నిర్వహించిన బాధ్యతలను ప్రస్తుతం తన భుజాలపై పెట్టారన్నాడు.
  
‘ధోని లేకుండా జరుగుతున్న తొలి మెగా టోర్నీ ఇది. ఇంతకు ముందు ధోని భాయ్‌ నిర్వహించిన ఫినిషర్‌ బాధ్యతలను నా భుజాలపై పెట్టారు. ఇది నాకు సవాల్‌ లాంటిది. నన్ను మొదటి నుంచి బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ధోని భాయ్‌. నా గురించి అతడికి అంతా తెలుసు. 2019లో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఓ టెలివిజన్‌ కార్యక్రమంలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కారణంగా నేను విమర్శల పాలైనప్పుడు ధోని భాయ్‌ నాకు ధైర్యం చెప్పాడు. అదొక్కటే కాదు నా కెరీర్లో ఎన్నో సార్లు అతడు నాకు మద్దతుగా నిలిచాడు. వ్యక్తిగతంగా నేను ఎలాంటి వ్యక్తినో ధోనికి బాగా తెలుసు. కాబట్టి, ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నన్ను ప్రశాంతంగా ఉంచే ఏకైక వ్యక్తి ధోని. అతడు నాకు అన్నలాంటి వాడు’ అని హర్దిక్‌ పాండ్య తెలిపాడు.

2020లో ధోని అంతర్జాతీయ క్రికెట్‌ వీడ్కోలు పలికిన తర్వాత జరుగుతున్న తొలి ప్రపంచకప్ ఇదే. అక్టోబరు 24న టీమిండియా దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియాకి మాజీ సారథి ధోని మెంటార్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని