T20 World Cup: హార్దిక్‌ కాదు.. మరో ఆల్‌రౌండర్‌ జట్టులోకి రావాలి!

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆరో బౌలర్ ఎంపిక విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్ బ్రాడ్ హ్యాడిన్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరిగే తర్వాత మ్యాచ్‌లోపు ఈ సమస్యను పరిష్కరించుకోవాలని

Updated : 28 Oct 2021 05:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆరో బౌలర్ ఎంపిక విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్ బ్రాడ్ హ్యాడిన్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌లోపు ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అతడు సలహా ఇచ్చాడు. ఈ మెగా టోర్నీ కోసం భారత ఆటగాడు హార్దిక్ పాండ్య ఆల్‌రౌండర్‌గా ఎంపికయ్యాడు. కానీ, అతడు బౌలింగ్‌ చేయడానికి ఇంకా ఫిట్‌గా లేనట్లు కనిపిస్తోంది. అందుకే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ బౌలింగ్‌ చేయలేదు. బ్యాట్‌తోనూ రాణించలేదు. కేవలం 11 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆరో బౌలర్‌ ఎంపిక గురించి హ్యాడిన్‌ మాట్లాడాడు. బౌలింగ్‌ చేయడానికి ఫిట్‌గా లేని హార్దిక్‌ను బెంచ్‌కు పరిమితం చేసి తుది జట్టులోకి మరో ఆల్‌రౌండర్‌ను తీసుకువచ్చే దిశగా భారత జట్టు యాజమాన్యం ఆలోచించాల్సి ఉంటుందని హ్యాడిన్ అభిప్రాయపడ్డాడు.

‘టీమిండియా ఆసక్తికరమైన సమస్యను ఎదుర్కొంటోంది. ఆ జట్టును ఆరో బౌలర్ సమస్య వేధిస్తోంది. హార్దిక్‌ పాండ్య బౌలింగ్ చేయడం లేదు. చాలాకాలంగా బౌలింగ్‌ చేయని అతడు.. ఇప్పుడు బౌలింగ్‌ చేసినా విజయవంతం అవుతాడో లేదో అనే అనుమానమూ ఉంది. కాబట్టి ఆరో బౌలర్‌ లోటుని పూడ్చేందుకు జట్టులోకి మరో ఆల్‌రౌండర్‌ని తీసుకోవాలి. టీమ్‌ఇండియా కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంది’ అని హ్యాడిన్ పేర్కొన్నాడు. 

హార్దిక్ పాండ్యను తుదిజట్టు నుంచి తప్పిస్తే అతడి స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ని తీసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఫాస్ట్‌బౌలింగ్‌ చేసే శార్దూల్ బ్యాట్‌తోనూ రాణించగలిగే సత్తా ఉన్న ఆటగాడు. సెప్టెంబరులో ముగిసిన ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌, ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఠాకూర్‌ మంచి ప్రదర్శన కనబరిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు