IND vs PAK: కెప్టెన్‌ కోహ్లీ హాఫ్‌ సెంచరీ.. పాక్‌ లక్ష్యం 152 పరుగులు

దాయాదుల పోరు రసవత్తరంగా సాగుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది...

Updated : 24 Oct 2021 21:29 IST

దుబాయ్‌: దాయాదుల పోరు రసవత్తరంగా సాగుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్‌కు 152 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది. పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు ఘోరంగా విఫలమయ్యారు. పాక్‌ బౌలర్‌ షాహీన్‌ అఫ్రిది దెబ్బకు ఓపెనర్లు ఇద్దరూ విలవిలాడారు. షాహీన్ వేసిన తొలి ఓవర్‌లో రోహిత్ (0) ఎదుర్కొన్న  మొదటి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం కేఎల్‌ రాహుల్ (3) కూడా ఔటయ్యాడు. షాహీన్‌ వేసిన అద్భుత డెలివరీకి రాహుల్‌ వద్ద సమాధానం లేకుండా పోయింది. క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరాడు. 

ఆదుకున్న సారథి

వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియాను సారథి విరాట్‌ కోహ్లీ (57) ఆదుకున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (11)తో కలిసి ఇన్నింగ్స్‌ను కాస్త నిలబెట్టాడు. అయితే షాట్ ఆడే క్రమంలో హసన్ అలీ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ కీపర్‌ చేతికి చిక్కాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రిషభ్ పంత్ (39)తో కలిసి కోహ్లీ వేగంగా పరుగులు రాబట్టాడు. దూకుడుగా ఆడే క్రమంలో రిషభ్‌ భారీ షాట్‌కు యత్నించి షాదాబ్‌ బౌలింగ్‌లో అతడికే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. రవీంద్ర జడేజా 13, హార్దిక్‌ పాండ్య 11 పరుగులు చేశారు. పాకిస్థాన్‌ బౌలర్లలో షాహీన్ 3, హసన్‌ అలీ 2, షాదాబ్‌ ఖాన్‌ ఒక వికెట్ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని