T20 League : హై హై ‘నాయకా’.. టీ20 లీగ్‌లో పైచేయి ఎవరిదంటే?

జట్టును నడపడం ఒక్కటే కెప్టెన్‌ కర్తవ్యం కాదు.. వ్యక్తిగతంగా రాణిస్తూ టీమ్‌కు అండగా నిలవాలి. బ్యాటర్‌, బౌలర్‌, ఆల్‌రౌండర్‌... ఎవరైనా సరే తమ...

Published : 06 May 2022 02:14 IST

కీలక ఇన్నింగ్స్‌లలో జట్టుకు అండగా నిలుస్తూ..

ఇంటర్నెట్ డెస్క్‌: జట్టును నడపడం ఒక్కటే కెప్టెన్‌ కర్తవ్యం కాదు.. వ్యక్తిగతంగా రాణిస్తూ టీమ్‌కు అండగా నిలవాలి. బ్యాటర్‌, బౌలర్‌, ఆల్‌రౌండర్‌... ఎవరైనా సరే తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిందే. సారథిగా మైదానంలో సరైన ప్రణాళికలను అమలు చేసి ఫలితాలను రాబట్టడంతోపాటు జట్టు సభ్యుల్లో భరోసా నింపేలా ఆడితే తిరుగుండదు. మరి ప్రస్తుత టీ20 లీగ్‌లో పది జట్ల నాయకులు ఎలా ఆడుతున్నారు.. టీమ్‌లను ఏ విధంగా నడిపిస్తున్నారో చూద్దాం.. 

అన్నింట్లోనూ హార్దిక్‌ టాప్‌..!

టీ20 లీగ్‌లోకి కొత్తగా అడుగు పెట్టిన గుజరాత్‌ అద్భుత ఆటతీరుతో అదరగొట్టేస్తోంది. పది మ్యాచ్‌లకుగాను ఎనిమిది విజయాలు, రెండు ఓటములతో గుజరాత్ (16) ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. ఇక గుజరాత్ సారథి హార్దిక్ పాండ్య అయితే కెప్టెన్సీతోపాటు వ్యక్తిగతంగా రాణిస్తూ జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు. బ్యాటింగ్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచుల్లో మూడు అర్ధశతకాలతో 309 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో వస్తున్నాడు కాబట్టి స్ట్రైక్‌రేట్‌ 132.05 వరకు ఉంది. బౌలింగ్‌లో అయితే పెద్దగా రిస్క్‌ చేయడం లేదు.  బౌలర్‌గా 111 బంతులు (18.3 ఓవర్లు) వేసిన 7.57 ఎకానమీతో 140 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లను తీశాడు. రాజస్థాన్‌పై (87*) సూపర్‌ బ్యాటింగ్‌ చేశాడు.


గత సీజన్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ.. 

గత సీజన్‌లో పంజాబ్‌కు నాయకత్వం వహించిన కేఎల్ రాహుల్ ఈసారి లఖ్‌నవూకు మారిపోయాడు. వ్యక్తిగత ఫామ్‌పరంగా ఏమాత్రం మార్పులేదు. అయితే టీమ్‌ను నడిపించడంలో మాత్రం చాలా మెరుగయ్యాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 10 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలను నమోదు చేసిన లఖ్‌నవూ (14) పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన ఐదు మ్యాచుల్లో కనీసం ఒకటి లేదా రెండు గెలిచినా ప్లేఆఫ్స్‌కు వెళ్లిపోయినట్లే. ఇప్పటికే రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలు నమోదు చేసిన కేఎల్ రాహుల్‌ 145 స్ట్రైక్‌రేట్‌తో 451 పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్ అత్యధిక స్కోరు 103. ఈ సీజన్‌లో శతకాలు చేసిన బ్యాటర్లలో రెండో ఆటగాడు కేఎల్ రాహులే కావడం విశేషం. 


వన్‌డౌన్‌లో అండగా నిలుస్తూ.. 

టీ20 లీగ్‌లో అత్యంత కీలక కెప్టెన్లలో సంజూ శాంసన్‌ ఒకరు. మంచి ఫామ్‌తో రాజస్థాన్‌ను నడిపిస్తున్న సంజూ ఈసారి వన్‌డౌన్‌లో వచ్చి వేగంగా పరుగులు రాబడుతున్నాడు. గత సీజన్‌లో రాజస్థాన్‌ తరఫున ఓపెనర్‌ వచ్చిన సంజూ శాంసన్‌ స్ట్రైక్‌రేట్ 136.72 ఉండేది. అయితే ఇప్పుడు వన్‌డౌన్‌ బ్యాటర్‌గా మాత్రం 153.61 స్టైక్‌రేట్‌తో పది మ్యాచుల్లో 298 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక కెప్టెన్‌గానూ ఈసారి రాజస్థాన్‌ను టాప్‌-4లో ఉండేలా చూస్తున్నాడు. ఇప్పటికే ఆరు విజయాలు, నాలుగు ఓటములతో 12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో కొనసాగుతోంది. మంచి ఫామ్‌లో ఉన్న జోస్‌ బట్లర్‌ను ఓపెనర్‌గా పంపి మంచి ఫలితాలు రాబడుతున్నాడు. అలానే స్పిన్‌ ద్వయం చాహల్-అశ్విన్‌ను చక్కగా వాడుకుంటూ విజయాలను సాధిస్తున్నాడు. 


హేమాహేమీలు ఉన్న జట్టు.. 

విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌, దినేశ్‌ కార్తిక్‌ వంటి హేమాహేమీలతో పాటు హసరంగ, సిరాజ్, హర్షల్‌లాంటి యువ క్రికెటర్లతో కూడిన బెంగళూరును నడపడం ఆషామాషీ వ్యవహారం కాదు. తొలి కప్‌ కోసం వేచి చూస్తున్న అభిమానులను సంతృప్తి పరచాలంటే వ్యక్తిగత ప్రదర్శనతోపాటు కెప్టెన్సీపరంగా సూపర్‌ ఫామ్‌ను కనబరచాలి. ప్రస్తుతం డుప్లెసిస్‌ కూడా ఇదే చేస్తున్నాడు. తొలిసారి టీ20 లీగ్‌లో కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన డుప్లెసిస్‌ బెంగళూరును కప్‌ దిశగానే నడిపిస్తున్నాడు. అయితే మధ్యమధ్యలో ఓటములతో డీలా పడినప్పటికీ ప్లేఆఫ్స్‌ రేసులో మాత్రం బెంగళూరు ఉంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లకుగాను ఆరు విజయాలు, ఐదు ఓటములను చవిచూసిన బెంగళూరు (12) పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మ్యాచ్‌ల్లో కనీసం ఇంకో రెండు గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు అవుతుంది. వ్యక్తిగతంగా డుప్లెసిస్‌ పదకొండు మ్యాచ్‌ల్లో 130.04 స్ట్రైక్‌రేట్‌తో 316 పరుగులను సాధించాడు.


కేన్‌.. కెప్టెన్‌గా ఓకే కానీ.. 

కేన్‌ విలియమ్సన్‌.. కెప్టెన్సీపరంగా తిరుగులేని ఆటగాడు. న్యూజిలాండ్‌, హైదరాబాద్‌కు ఎన్నో విజయాలను అందించాడు. అయితే వ్యక్తిగతంగా మాత్రం తన స్థాయి ఆటను మాత్రం ప్రదర్శించలేకపోయాడు. ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచుల్లో 195 పరుగులు మాత్రమే చేశాడు. కేన్‌ స్ట్రైక్‌రేట్‌ (99.49) వంద కంటే తక్కువ కావడం గమనార్హం. వరుసగా ఐదు మ్యాచ్‌లను గెలిచిన సందర్భాల్లో యువ ఓపెనర్‌ అభిషేక్ శర్మతో కలిసి మంచి భాగస్వామ్యాలనే నిర్మించాడు. అయితే నెమ్మదిగా ఆడటమే కేన్‌ సమస్య. పరిస్థితులకు తగ్గట్లుగా దూకుడుగా ఆడటంలో విలియమ్సన్‌ను మించిన సారథి మరొకరు ఉండరు. ఇంకా ఐదు మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో కేన్‌ వ్యక్తిగతంగా రాణించడంతోపాటు హైదరాబాద్‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చాలని అభిమానులు ఆశిస్తున్నారు. 


అప్పుడప్పుడు తడబాటుకు గురై.. 

తొలి మ్యాచ్‌లోనే బెంగళూరు వంటి పటిష్ఠమైన జట్టుపై భారీ లక్ష్య ఛేదన చేసి మరీ మయాంక్‌ అగర్వాల్ నేతృత్వంలోని పంజాబ్‌ విజయం సాధించింది. ఇప్పటి వరకు పది మ్యాచ్‌లను ఆడిన పంజాబ్‌ ఐదు విజయాలు, ఐదు ఓటములను చవి చూసింది. దీంతో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడించి మళ్లీ ప్లేఆఫ్స్‌ రేసులోకి దూసుకొచ్చింది. జట్టును బాగానే నడిపిస్తున్న మయాంక్‌ బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా రాణించడంలేదు. తానాడిన తొమ్మిది మ్యాచుల్లో మయాంక్‌ కేవలం 161 పరుగులను మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్‌ సెంచరీ ఉంది. గత సీజన్‌లో 12 మ్యాచులకు 441 పరుగులు చేసి అదరగొట్టిన మయాంక్‌కు ఈసారి కెప్టెన్సీ భారంగా మారిందేమోనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 


గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లిన సారథి.. 

తొలి మ్యాచ్‌లోనే ఛాంపియన్‌ ముంబయిని మట్టికరిపించి పాయింట్ల ఖాతాను ఓపెన్‌ చేసిన దిల్లీకి  ఆ తర్వాత పెద్దగా ఏదీ కలిసిరాలేదు. జట్టులో అగ్రస్థాయి ఆటగాళ్లున్నప్పటికీ విజయాల కోసం పోరాడుతోంది. ఆ జట్టు సారథి రిషభ్‌ పంత్ అయితే అడపాదడపా మంచి ఇన్నింగ్స్‌లనే ఆడుతున్నప్పటికీ జట్టును గెలిపించలేకపోతున్నాడు. కీలక సమయాల్లో ఔటవ్వడంతో ఆ ప్రభావం జట్టుపై పడుతోంది. ఇప్పటివరకు దిల్లీ తొమ్మిది మ్యాచ్‌లకుగాను నాలుగు విజయాలను మాత్రమే సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో దిల్లీ (8) ఏడో స్థానంలో ఉంది. మిగిలిన ఐదు మ్యాచ్‌లను గెలిస్తే కానీ ప్లేఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండవు. మరోవైపు రిషభ్‌ పంత్‌ కూడా బ్యాటింగ్‌లో రాణించాల్సి ఉంది. ఒక్క అర్ధ శతకం కూడా లేకపోవడం గమనార్హం. నాలుగోస్థానంలో వస్తున్న పంత్ ఇప్పటి వరకు 234 పరుగులను మాత్రమే చేశాడు. 


కొత్త సారథి అయినా మారుస్తాడని భావిస్తే.. 

గత సీజన్‌లో ఇయాన్ మోర్గాన్‌ నేతృత్వంలోని కోల్‌కతా ఫైనల్‌కు చేరుకుంది. వ్యక్తిగతంగా మోర్గాన్‌ రాణించకపోయినా జట్టును నడపడంలో మాత్రం సక్సెస్‌ అయ్యాడు. అయితే భారీ మొత్తం వెచ్చించిన కొనుగోలు చేసిన శ్రేయస్‌ అయ్యర్ (12.25 కోట్లు) మాత్రం కోల్‌కతాను ప్లేఆఫ్స్‌కు చేర్చడానికే నానాపాట్లు పడుతున్నాడు. ఫామ్‌పరంగా శ్రేయస్‌ రాణిస్తున్నప్పటికీ జట్టు విజయాల్లో మాత్రం కీలక పాత్ర పోషించలేకపోతున్నాడు. టీమ్‌ను గెలిపించే ఇన్నింగ్స్‌ లేకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్‌ రెండు అర్ధశతకాలను సాధించాడు. అదేవిధంగా 133.33 స్ట్రైక్‌రేట్‌తో 324 పరుగులు చేశాడు. కానీ ఇవేవీ కోల్‌కతాకు విజయాలను అందించలేకపోతున్నాయి. బ్యాటర్లు, బౌలర్లను సరైనవిధంగా వినియోగించుకోవడంలో విఫలమయ్యాడు. 10 మ్యాచ్‌లకుగాను కేవలం నాలుగు విజయాలను మాత్రమే సాధించిన కోల్‌కతా (8) పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.


కెప్టెన్లు మారినా.. తేడా ఏమీ లేదు

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా కొత్త కెప్టెన్‌తో టోర్నీకి వచ్చిన చెన్నై తన ఆటతీరుతో అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. రవీంద్ర జడేజా నేతృత్వంలో ఎనిమిది మ్యాచ్‌లను ఆడిన చెన్నై ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది.  వ్యక్తిగతంగా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం 116 పరుగులు, ఐదు వికెట్లను మాత్రమే తీశాడు. దీంతో తన ప్రదర్శనపై కెప్టెన్సీ భారం పడుతుందని భావించిన జడేజా నాయకత్వ బాధ్యతలను వదిలేశాడు. దీంతో ఎంఎస్ ధోనీ మళ్లీ జట్టు పగ్గాలను అందుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే హైదరాబాద్‌పై విజయం సాధించినా.. బెంగళూరుపై ఓటమి తప్పలేదు. ఇక ధోనీ సంగతికొస్తే మొదటి మ్యాచ్‌లోనే ఏడో స్థానంలో హాఫ్ సెంచరీ చేశాడు. ముంబయిపై చివరి ఓవర్‌లో విజృంభించి చెన్నై గెలిపించాడు. ఈ రెండూ మినహా మిగతా మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రస్తుతం 10 మ్యాచ్‌లకుగాను రెండు విజయాలతోనే ఉన్న చెన్నైకి ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే. 


సారథి ప్రదర్శన ఘోరం.. సారథ్యం ఘోరం.. 

ప్రస్తుత సీజన్‌లో అత్యంత ఘోరంగా విఫలమైన జట్టు ఏదైనా ఉందంటే అది ముంబయినే. తొమ్మిదో మ్యాచ్‌లో ముంబయి తొలి విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది. ప్రస్తుత సీజన్‌లో అత్యంత దారుణ ప్రదర్శన చేసిన  కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచిపోయాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లకుగాను కేవలం 155 పరుగులను మాత్రమే సాధించాడు. ఇందులో ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ అవకాశాలను చేజార్చుకున్న ముంబయి ఇకనైనా గెలుపుబాట పట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. కనీసం మిగిలిన మ్యాచుల్లోనైనా రోహిత్ శర్మ బ్యాట్‌ను ఝుళిపించాల్సిందే. ఆసీస్‌ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు తగినంత ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకుంటేనే టీమ్‌ఇండియా విజయాలు ఆధారపడి ఉంటాయి. కెప్టెన్‌గా రాణిస్తే మిగతా బ్యాటర్లూ ఉత్సాహంగా ఆడేందుకు ప్రయత్నిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని