Rahul Chahar: అంపైర్‌ నిర్ణయంపై ఆగ్రహం.. సన్‌గ్లాసెస్‌ను విసిరికొట్టిన టీమ్‌ఇండియా బౌలర్‌

ఇటీవల అంపైర్‌ నిర్ణయంపై ఆగ్రహంతో వికెట్లనే కాలుతో తన్నడం.. నిరసనను తెలియజేసేందుకు...

Published : 27 Nov 2021 01:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల అంపైర్‌ నిర్ణయంపై ఆగ్రహంతో వికెట్లనే కాలుతో తన్నడం.. నిరసనను తెలియజేసేందుకు అతిగా ప్రవర్తించడం వంటి సంఘటనలను చూస్తున్నాం.. అయితే ఇలాంటి వివాదంలో భారత క్రికెటర్‌ రాహుల్‌ చాహర్‌ చేరాడు. బౌలింగ్‌ సందర్భంగా అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తితో తన సన్‌గ్లాసెస్‌ను విసిరేసిన ఘటన దక్షిణాఫ్రికా పర్యటనలో చోటు చేసుకుంది. ఇటీవల భారత్‌ - ఏ జట్టు సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లింది. దక్షిణాఫ్రికా- ఏతో జరుగుతున్న అనధికారిక తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ - ఏ తరఫున బౌలింగ్‌ చేస్తున్న రాహల్‌ చాహర్‌ (1/125) రెండో రోజు ఆటలో భాగంగా 128వ ఓవర్‌ వేశాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్‌ సినెథెంబాకు చాహర్‌ ఫ్లాటర్‌ డెలివరీని సంధించాడు. బంతి బ్యాటర్‌ ప్యాడ్లకు తగలడంతో ఔట్‌ అప్పీల్‌కు వెళ్లాడు. అయితే అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించడంతో మరోసారి గట్టిగా అప్పీల్‌ చేశాడు. అంపైర్‌ నిర్ణయంలో ఎలాంటి మార్పులేదు. దీంతో  అసహనానికి గురైన చాహర్‌ వెంటనే తన సన్‌గ్లాసెస్‌ను విసిరికొట్టాడు. ఈ క్రమంలో అంపైర్‌తో చాహర్‌ చర్చిస్తుండగానే దక్షిణాఫ్రికా బ్యాటర్లు పూర్తి చేసేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

మూడు అనధికారిక టెస్టులను ఆడేందుకు భారత్‌ ఏ జట్టు సౌతాఫ్రికాకు వెళ్లింది. 23వ తేదీ నుంచి ప్రారంభమైన తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 509/7 స్కోరు వద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం భారత్‌ - ఏ కూడా ధాటిగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఈశ్వరన్‌ (103), ప్రియాంక్ (96), పృథ్వీ షా (48), హనుమ విహారి (25) రాణించడంతో 308/4తో మూడో రోజు ఆటను ముగించింది. ఇవాళ నాలుగో రోజు ఆట ప్రారంభానికి వర్షం అడ్డంకిగా మారింది. ప్రస్తుతం క్రీజ్‌లో బాబా అగర్జిత్‌ (19*), ఉపేంద్ర యాదవ్‌ (5*)  ఉన్నారు. 

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని