కంగారూలకు ‘పింక్‌’ చుక్కలు.. తొలిసారి!

డే/నైట్‌ టెస్టులు ఆడటంలో ఆస్ట్రేలియా కొట్టిన పిండి. గులాబి బంతితో ఆడిన ప్రతిసారీ గెలుపు వారినే వరించింది. ఏడుసార్లు ఆడితే ఏడింట్లోనూ విజయదుందుభి మోగించింది. టాస్‌ ఎవరు గెలిచినా, తొలుత బ్యాటింగ్‌ ఎవరు చేసినా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం మాత్రం వారిదే....

Updated : 18 Dec 2020 20:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డే/నైట్‌ టెస్టులు ఆడటం ఆస్ట్రేలియాకు కొట్టిన పిండి. గులాబి బంతితో ఆడిన ప్రతిసారీ గెలుపు వారినే వరించింది. ఏడుసార్లు ఆడితే ఏడింట్లోనూ విజయదుందుభి మోగించింది. టాస్‌ ఎవరు గెలిచినా, తొలుత బ్యాటింగ్‌ ఎవరు చేసినా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం మాత్రం వారిదే. అలాంటిది తొలిసారిగా పింక్‌చెర్రీతో ఆడుతూ ‘కంగారు’ పడుతున్నారు.

ఆస్ట్రేలియా జట్టు 2015 నుంచి గులాబి టెస్టులు ఆడుతోంది. న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌పై రెండుసార్లు గెలిచింది. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంకనూ మట్టికరిపించింది. ఈ మ్యాచుల్లో తొలి ఇన్నింగ్సుల్లో ఆధిక్యం ఎప్పుడూ కంగారూలకే లభించేది. గత ఏడు మ్యాచుల్లో తొలి ఇన్నింగ్సుల్లో 22, 124, 287, 215, 179, 287, 250 ఆధిక్యాలు సాధించింది. కానీ టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో మాత్రం ఆ జట్టు ఆధిక్యం సాధించలేకపోయింది. 53 పరుగుల లోటుతో ఇన్నింగ్స్‌ను ముగించింది. గులాబికి సంబంధించి ఇదో గొప్ప రికార్డు.

రవిచంద్రన్‌ అశ్విన్ (18-3-55-4) అద్భుత బౌలింగ్‌కు తోడు ఉమేశ్‌ యాదవ్‌ (16.1-5-40-3), జస్ప్రీత్‌ బుమ్రా (21-7-52-2) భారీ దెబ్బకొట్టడంతోనే కంగారూలకు తొలిసారి ‘పింక్‌’ చుక్కలు కనిపించాయి. స్వల్పమే అని భావించిన టీమ్‌ఇండియా స్కోరు (244)ను వారు దాటలేకపోయారు. ఓపెనర్లిద్దరినీ బుమ్రా ఔట్‌ చేయడం.. స్టీవ్‌స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, కామెరాన్‌ గ్రీన్‌ వంటి మేటి ఆటగాళ్లను యాష్‌ పెవిలియన్‌ పంపించడంతోనే ఇది సాధ్యమైంది. వీరికి తోడుగా మహ్మద్‌ షమి వికెట్లేమీ తీయకపోయినా అత్యంత కట్టుదిట్టమైన బంతులు, లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బెంబేలెత్తించాడు. ఇక ఆసియా ఆవల అశ్విన్‌కు ఇవి మూడో అత్యుత్తమ గణాంకాలు కావడం ప్రత్యేకం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని