Ind vs NZ: ముగింపు అదిరింది

భారత్‌ది అదే జోరు. అదే ఆధిపత్యం. ప్రపంచకప్‌ వైఫల్యం తర్వాత తొలి సిరీస్‌లో పట్టుదలతో ఆడిన టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌ను పోటీలోనే లేకుండా చేసింది. మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగవుతూ, గెలుపు అంతరాన్ని పెంచుతూ వెళ్లిన రోహిత్‌ సేన.. ఆదివారం చివరి టీ20లో మరింత భారీ విజయాన్నందుకుని క్లీన్‌స్వీప్‌ను పూర్తి చేసింది. ఈసారి భారత్‌ మొదట బ్యాటింగ్‌ చేసినా ఫలితం మారలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

Updated : 22 Nov 2021 11:37 IST

సిరీస్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌

 చివరి టీ20లో కివీస్‌పై భారత్‌ ఘనవిజయం

 చెలరేగిన రోహిత్‌.. విజృంభించిన అక్షర్‌

కోల్‌కతా

భారత్‌ది అదే జోరు. అదే ఆధిపత్యం. ప్రపంచకప్‌ వైఫల్యం తర్వాత తొలి సిరీస్‌లో పట్టుదలతో ఆడిన టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌ను పోటీలోనే లేకుండా చేసింది. మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగవుతూ, గెలుపు అంతరాన్ని పెంచుతూ వెళ్లిన రోహిత్‌ సేన.. ఆదివారం చివరి టీ20లో మరింత భారీ విజయాన్నందుకుని క్లీన్‌స్వీప్‌ను పూర్తి చేసింది. ఈసారి భారత్‌ మొదట బ్యాటింగ్‌ చేసినా ఫలితం మారలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విధ్వంసంతో మెరుగైన స్కోరు సాధించిన టీమ్‌ఇండియా.. అక్షర్‌ మాయాజాలంతో న్యూజిలాండ్‌ను కుప్పకూల్చింది.

టీమ్‌ఇండియా అదరగొట్టింది. తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ చివరిదైన మూడో టీ20లో 73 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. రోహిత్‌ (56; 31 బంతుల్లో 5×4, 3×6) మెరుపులతో భారత్‌ మొదట 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్‌ (3/9)తో పాటు ఇతర బౌలర్లూ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఛేదనలో కివీస్‌.. 17.2 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది.  గప్తిల్‌ (51; 36 బంతుల్లో 4×4, 4×6) ఒక్కడే రాణించాడు. అతడు కాకుండా సీఫర్ట్‌ (17), ఫెర్గూసన్‌ (14) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. హర్షల్‌ పటేల్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. చాహల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌ తలో వికెట్‌ చేజిక్కించుకున్నారు. ఈ విజయంతో సిరీస్‌ను భారత్‌ 3-0తో చేజిక్కించుకుంది. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మొదటి టెస్టు గురువారం ఆరంభమవుతుంది.

అక్షర్‌ తిప్పేశాడు..: ఛేదనలో ఆరంభంలోనే అక్షర్‌ పటేల్‌ న్యూజిలాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టేశాడు. అతడి మాయాజాలానికి కివీస్‌..  5 ఓవర్లలో 30 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది. నిజానికి కివీస్‌ ఇన్నింగ్స్‌ ధాటిగా ఆరంభమైంది. గప్తిల్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో తొలి రెండు ఓవర్లలోనే 21 పరుగులొచ్చాయి. కానీ మూడో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన అక్షర్‌.. మిచెల్‌ (5), చాప్‌మన్‌ (0)ను ఔట్‌ చేయడం ద్వారా కివీస్‌ను గట్టి దెబ్బతీశాడు. అతడు తన తర్వాతి ఓవర్లో ఫిలిప్స్‌ (0)నూ వెనక్కి పంపాడు. తన తొలి రెండు ఓవర్లలో అక్షర్‌ రెండే పరుగులివ్వడం విశేషం. అయితే మరోవైపు సీఫర్ట్‌ అండగా నిలవగా ధాటిగా బ్యాటింగ్‌ చేసిన గప్తిల్‌.. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 10 ఓవర్లలో 68/3తో న్యూజిలాండ్‌ కోలుకుంది. కానీ చకచకా రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా తిరిగి మ్యాచ్‌పై టీమ్‌ఇండియా పట్టుబిగించింది. చాహల్‌ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌కు యత్నించిన గప్తిల్‌ లాంగాన్‌లో సూర్యకుమార్‌కు చిక్కగా.. అనవసరంగా రెండో పరుగుకు ప్రయత్నించి సీఫర్ట్‌ రనౌటయ్యాడు. 12 ఓవర్లలో స్కోరు 76/5. కివీస్‌కు లక్ష్యం చాలా కష్టంగా మారిపోయింది. చివరి 8 ఓవర్లలో 109 పరుగులు చేయాల్సిన పరిస్థితి. సమీకరణం క్లిష్టంగానే ఉనా... విధ్వంసక వీరుడు నీషమ్‌ క్రీజులో ఉండడంతో అప్పటికి కివీస్‌ ఆశలు మిగిలే ఉన్నాయి. కానీ ఆ ఆశలు ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. 13వ ఓవర్లో హర్షల్‌ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌కు యత్నించిన నీషమ్‌.. పంత్‌ అందుకున్న ఓ చక్కని క్యాచ్‌కు నిష్క్రమించాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌ ఓటమి   లాంఛనమే. టెయిలెండర్లేమీ అద్భుతాలు చేయలేదు. వాళ్ల ఆట కేవలం ఓటమి అంతరం తగ్గించడానికే.

ఓపెనర్ల ధనాధన్‌: సిరీస్‌లో వరుసగా మూడోసారి టాస్‌ గెలిచిన రోహిత్‌ శర్మ ఈసారి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. భారత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభమైన తీరు చూస్తే.. ఆ జట్టు చేసిన స్కోరు కాస్త తక్కువే. ఆరంభంలో రోహిత్‌, ఇషాన్‌ కిషన్‌ (29; 21 బంతుల్లో 6×4) విధ్వంసక బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అలవోకగా షాట్లు ఆడారు. బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఓవర్లో రోహిత్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా.. తర్వాతి ఓవర్లో కిషన్‌ రెండు ఫోర్లు సాధించాడు. బ్యాట్స్‌మెన్‌ ఏ బౌలర్‌నూ వదిలి పెట్టలేదు. బౌండరీల మోతను కొనసాగించారు. రోహిత్‌ రెండు ఫోర్లు, సిక్స్‌.. ఇషాన్‌ ఓ ఫోర్‌ బాదడంతో ఫెర్గూసన్‌ ఓవర్లో ఏకంగా 20 పరుగులొచ్చాయి. పవర్‌ ప్లే ముగిసేసరికి 69/0తో నిలిచిన టీమ్‌ఇండియా.. అలవోకగా 200పై స్కోరు సాధించేలా కనిపించింది. కానీ అనూహ్యంగా తడబడింది. కివీస్‌ బౌలర్లు పుంజుకోవడంతో చకచకా నాలుగు వికెట్లు కోల్పోయి.. పరుగుల వేటలో వెనుకబడింది. ఏడో ఓవర్లో శాంట్నర్‌ ఓవర్‌తో ఇన్నింగ్స్‌ గమనం మారింది.  ఆ ఓవర్లో ఇషాన్‌ కిషన్‌ను ఔట్‌ చేయడం ద్వారా జోరు మీదున్న ఓపెనింగ్‌ జంటను విడదీసిన అతడు.. సూర్యకుమార్‌ (0)ను ఖాతా తెరవకుండానే వెనక్కి పంపాడు. తన తర్వాతి ఓవర్లో అతడు పంత్‌ (4)నూ ఔట్‌ చేశాడు. ధాటిగా ఆడే ప్రయత్నంలో పంత్‌ క్యాచ్‌ ఔటయ్యాడు. 12వ ఓవర్లో రోహిత్‌.. సోధీకి రిటర్న్‌ క్యాచ్‌ వెనుదిరగడంతో భారత్‌ 103/4తో నిలిచింది. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ (25; 20 బంతుల్లో 2×4), వెంకటేశ్‌ అయ్యర్‌ (20; 15 బంతుల్లో 1×4, 1×6) పరిస్థితిని చక్కదిద్దారు. 15 ఓవర్లకు స్కోరు 134/4. కానీ ఇక రెచ్చిపోతారనుకున్న దశలో నిలదొక్కుకున్న బ్యాట్స్‌మెన్‌ ఇద్దరూ ఔటయ్యారు.   వెంకటేశ్‌ అయ్యర్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వరుస ఓవర్లలో వెనుదిరిగారు. 140/6తో నిలిచిన భారత్‌.. గట్టి లక్ష్యాన్ని నిర్దేశించగలుగుతుందా అన్న అనుమానం కలిగింది. కానీ హర్షల్‌ పటేల్‌ (18; 11 బంతుల్లో 2×4, 1×6), దీపక్‌ చాహర్‌ (21 నాటౌట్‌; 8 బంతుల్లో 2×4, 1×6) బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ మెరుగైన స్కోరుతో ఇన్నింగ్స్‌ను ముగించింది. దీపక్‌ చాహర్‌ రెండు ఫోర్లు, సిక్స్‌ బాదడంతో మిల్నె వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో 19 పరుగులొచ్చాయి.


మేం ఓం ప్రణాళిక ప్రకారం ఆడాం. మిడిల్‌ ఓవర్లలో ఇంకా మెరుగ్గా బ్యాటింగ్‌ చేయాల్సింది. కానీ లోయర్‌ ఆర్డర్‌.. ఇన్నింగ్స్‌ను ముగించిన తీరు సంతోషాన్నిచ్చింది. హర్షల్‌ చివరి రెండు మ్యాచ్‌ల్లో చక్కగా రాణించాడు. స్పిన్నర్లు సిరీస్‌ ఆసాంతం మెరుగైన ప్రదర్శన చేశారు. అశ్విన్‌, అక్షర్‌, చాహల్‌ రాణించారు. వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా బాగానే బౌలింగ్‌ చేశాడు. అతడు మరింత ఉపయుక్తమైన బౌలర్‌ అవుతాడు. చాలా జట్లు లోతైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగి ఉన్నాయి. నంబర్‌ 8, 9 కీలక పాత్ర పోషిస్తున్నారు. హర్షల్‌ మంచి బ్యాటర్‌. దీపక్‌ బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని శ్రీలంకలో చూశాం.

- రోహిత్‌ శర్మ


భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) అండ్‌ (బి) సోధి 56; ఇషాన్‌ కిషన్‌ (సి) సీఫర్ట్‌ (బి) శాంట్నర్‌ 29; సూర్యకుమార్‌ (సి) గప్తిల్‌ (బి) శాంట్నర్‌ 0; పంత్‌ (సి) నీషమ్‌ (బి) శాంట్నర్‌ 4; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) మిచెల్‌ (బి) మిల్నె 25; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) చాప్‌మన్‌ (బి) బౌల్ట్‌ 20; అక్షర్‌ పటేల్‌ నాటౌట్‌ 2; హర్షల్‌ పటేల్‌ హిట్‌ వికెట్‌ (బి)ఫెర్గూసన్‌ 18; దీపక్‌ చాహర్‌ నాటౌట్‌ 21; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లకు  7 వికెట్లకు) 184; వికెట్ల పతనం: 1-69, 2-71, 3-83, 4-103, 5-139, 6-140, 7-162; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-31-1; మిల్నె 4-0-47-1; ఫెర్గూసన్‌ 4-0-45-1; శాంట్నర్‌ 4-0-27-3; ఇష్‌ సోధి 4-0-31-1

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్తిల్‌ (సి) సూర్యకుమార్‌ (బి) చాహల్‌ 51; మిచెల్‌ (సి) హర్షల్‌ (బి) అక్షర్‌ 5; చాప్‌మన్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అక్షర్‌ 0; ఫిలిప్స్‌ (బి) అక్షర్‌ 0; సీఫర్ట్‌ రనౌట్‌ 17; నీషమ్‌ (సి) పంత్‌ (బి) హర్షల్‌ 3; శాంట్నర్‌ రనౌట్‌ 2; మిల్నె (సి) రోహిత్‌ (బి) వెంకటేశ్‌ అయ్యర్‌ 7; ఇష్‌ సోధి (సి) సూర్యకుమార్‌ (బి) హర్షల్‌ 9; ఫెర్గూసన్‌ (సి) అండ్‌ (బి) దీపక్‌ చాహర్‌ 14; బౌల్ట్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 1 మొత్తం: (17.2 ఓవర్లలో ఆలౌట్‌) 111; వికెట్ల పతనం: 1-21, 2-22, 3-30, 4-69, 5-76, 6-76, 7-84, 8-93, 9-95; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2-0-12-0; దీపక్‌ చాహర్‌ 2.2-0-26-1; అక్షర్‌ పటేల్‌ 3-0-9-3; చాహల్‌ 4-0-26-1; వెంకటేశ్‌ అయ్యర్‌   3-0-12-1; హర్షల్‌ పటేల్‌ 3-0-26-2


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని