Parthiv Patel: ఒకరికి ఇంగ్లిష్‌ రాదు.. మరొకరికి హిందీ రాదు.. అయినా ఒక్కటిగా టీమ్‌ఇండియా

టీమ్‌ఇండియాలో ఐక్యత మరింత కనిపిస్తోందని మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ అంటున్నాడు. ఆటగాళ్లంతా ఒక బృందంగా ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నాడు....

Published : 21 Aug 2021 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియాలో ఐక్యత మరింత కనిపిస్తోందని మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ అంటున్నాడు. ఆటగాళ్లంతా ఒక బృందంగా ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నాడు. ఇతర భాషలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా అంతా ఏకతాటిపై కనిపిస్తున్నారని ఆనందించాడు.

‘ఒకసారి టీమ్‌ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌ చూడండి. విరాట్‌ కోహ్లీతో కలిసి ఇషాంత్‌ శర్మ తిరుగుతున్నాడు. అతడే ఉమేశ్‌ యాదవ్‌తో తిరగడమూ మనం చూశాం. వారిద్దరివీ వేర్వేరు మనస్తత్వాలు కానీ కలిసే తిరుగుతున్నారు. హార్దిక్ పాండ్యతో కలిసి రిషభ్ పంత్‌ బయటికి వెళ్లాడు. అందులో ఒకరిది పశ్చిమ భారత దేశం. మరొకరిది ఉత్తర భారత దేశం. తూర్పు నుంచీ కొందరు ఉన్నారు’ అని పటేల్‌ అన్నాడు.

‘మీరు దినేశ్‌ కార్తీక్‌, కృనాల్‌, హార్దిక్‌ను చూడండి. వారు మంచి మిత్రులు. ఒకరికి ఇంగ్లిష్‌ రాదు. మరొకరికి హిందీ రాదు. అయినా వారి స్నేహం బలంగా ఉంది. టీమ్‌ఇండియా ఈ తరంలో ఎందుకింత బాగా ఆడుతోందంటే కారణం ఇదే. వారంతా కలిసికట్టుగా ఉన్నారు. ఐపీఎల్‌ సైతం ఇందుకు దోహదం చేసింది’ అని పార్థివ్‌ తెలిపాడు.

ప్రస్తుతం టీమ్‌ఇండియా జోరు మీదుంది. ఐదు టెస్టుల సిరీసులో 1-0తో ఆధిక్యంలో ఉంది. మొదటి టెస్టును డ్రా చేసుకున్న కోహ్లీ సేన రెండో టెస్టులో అద్వితీయమైన విజయం అందుకుంది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌ కలిసి రాణించారు. ఆఖరి రోజు భారత పేసర్లు ఆంగ్లేయులను కేవలం 60 ఓవర్లలోపే ఆలౌట్‌ చేసి విజయం అందించడం ప్రత్యేకం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని