Team India: రోహిత్‌, రాహుల్‌, పంత్‌ కాకుండా తెరపైకి కొత్త కెప్టెన్‌ పేరు

ఈ పొట్టి ప్రపంచకప్ తర్వాత విరాట్‌ కోహ్లీ టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ఇంతకుముందే వెల్లడించడంతో తర్వాతి సారథి ఎవరనే విషయం ఆసక్తిగా మారింది...

Published : 08 Nov 2021 01:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ పొట్టి ప్రపంచకప్ తర్వాత విరాట్‌ కోహ్లీ టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ఇంతకుముందే వెల్లడించడంతో తర్వాతి సారథి ఎవరనే విషయం ఆసక్తిగా మారింది. ఈ ప్రపంచకప్‌ తర్వాత భారత్‌ స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే. దీంతో అప్పుడు ఎవరు జట్టును నడిపిస్తారనే విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.

కెప్టెన్సీ రేసులో ఇప్పటికే రోహిత్‌, రాహుల్‌, రిషభ్‌ పంత్ పేర్లు ప్రచారంలో ఉండగా తాజాగా మరో ఆటగాడి పేరు తెరపైకి వచ్చింది. మాజీ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా ఈ విషయంపై ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ జస్ప్రిత్‌ బుమ్రా పేరును సూచించాడు. అతడు ఇప్పుడు జట్టులో కీలక ఆటగాడని, పరిస్థితులను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటాడని చెప్పాడు. అలాగే అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతున్నాడని గుర్తుచేశాడు. ‘రోహిత్‌ కాకుండా మనం పంత్, రాహుల్‌ పేర్లు కూడా వింటున్నాం. పంత్‌ టీమ్‌ఇండియాతో అన్ని దేశాలు తిరిగొచ్చాడు. కొన్నిసార్లు జట్టు నుంచి కూడా వైదొలిగాడు. మరోవైపు టెస్టుల్లో మయాంక్‌ గాయపడ్డాక రాహుల్‌ను తీసుకున్నారు. అయితే, బుమ్రా కూడా ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. అతడు అన్ని ఫార్మాట్లలో తుది జట్టులో ఉంటున్నాడు. కెప్టెన్సీకి అర్హుడే. పేసర్లు కెప్టెన్సీ చేయొద్దని ఎక్కడా రాసిపెట్టలేదు’ అని నెహ్రా తన అభిప్రాయం పంచుకున్నాడు.

ఇదిలా ఉండగా వచ్చే వారమే టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్‌ ఎవరనేది బీసీసీఐ వెల్లడించే అవకాశం ఉంది. ఈనెలలో న్యూజిలాండ్‌తో క్రికెట్‌ మ్యాచ్‌లు ఉన్నందున అంతకుముందే ఈ విషయంపై స్పష్టతనిస్తుందని సమాచారం. వచ్చే వారం ప్రపంచకప్‌ టోర్నీ ముగియనున్న నేపథ్యంలో ఆ సమయంలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఈ టోర్నీలో భారత్‌ ప్రస్తుతం గ్రూప్‌-2లో రెండు విజయాలతో 4 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అఫ్గాన్‌, స్కాట్లాండ్‌లపై గెలిచిన కోహ్లీసేన అంతకుముందు పాక్‌, న్యూజిలాండ్‌తో ఓటమిపాలై సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈరోజు అఫ్గానిస్థాన్.. న్యూజిలాండ్‌ను ఓడిస్తే టీమ్‌ఇండియా సెమీస్‌ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని