INDvsENG: రెండో టెస్టుకు సిద్ధంగా ఉండమన్నారు.. అంతలోనే అలా జరిగింది: అశ్విన్

లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై భారత బౌలర్లు చెలరేగి ఐదో రోజు ఆతిథ్య జట్టును 120...

Published : 21 Aug 2021 01:27 IST

లండన్‌: లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై భారత బౌలర్లు చెలరేగి ఐదో రోజు ఆతిథ్య జట్టును 120 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూల్చారు. దీంతో భారత్‌ అనూహ్య విజయం సాధించింది. అయితే, ఆ మ్యాచ్‌కు ముందు అక్కడి వాతావరణం వేడిగా ఉందని, తనని సిద్ధంగా ఉండమని చెప్పారని సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తాజాగా వెల్లడించాడు. టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌తో తన యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యుల చేశాడు. మ్యాచ్‌కు ముందు లార్డ్స్‌లో వాతావరణం వేడిగా ఉందని, దీంతో తుది జట్టులో ఆడేందుకు సిద్ధంగా ఉండాలని అంతకుముందే జట్టు యాజమాన్యం తనతో చెప్పిందని అశ్విన్‌ వివరించాడు. కానీ, ఒక్కసారిగా మ్యాచ్‌ ప్రారంభమయ్యే రోజు ఉదయం అనుకోకుండా వర్షం కురవడంతో తుది జట్టు నుంచి తప్పించారని తెలిపారు. అలా రెండో టెస్టులో తాను ఆడకపోవడానికి వాతావరణమే కీలక పాత్ర పోషించిందని చెప్పాడు.

అనంతరం ఇదే విషయంపై స్పందించిన శ్రీధర్‌.. టీమ్‌ఇండియాకు మేటి బౌలింగ్‌ యూనిట్‌ ఉందని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ప్రపంచపు అత్యుత్తమ స్పిన్నర్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం అంత తేలిక కాదన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ల గురించి మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్‌, రోహిత్‌ శర్మ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారన్నారు. రాహుల్‌ శతకంతో మెరవగా, రోహిత్‌ తనదైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాడని మెచ్చుకున్నారు. చివరగా రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన టెయిలెండర్లు బుమ్రా, షమి మేటి ప్రదర్శన చేశారని ప్రశంసించారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 364 పరుగులు చేయగా ఇంగ్లాండ్‌ 391 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 194 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన సందర్భంలో షమి(56), బుమ్రా(34) నాటౌట్‌గా నిలిచి ఎనిమిదో వికెట్‌కు 89 పరుగుల అత్యంత కీలక భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ను 298/8 స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేయగా ఆపై ఇంగ్లాండ్‌ 120 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. అందులో పేసర్లే 19 వికెట్లు తీయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని