Tim Paine: మహిళకు అసభ్య సందేశాలు.. ఆసీస్‌ కెప్టెన్సీకి టిమ్‌పైన్‌ రాజీనామా

తోటి మహిళకు అసభ్యకరమైన సందేశాలు పంపిన నేపథ్యంలో ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథి టిమ్‌పైన్‌ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు...

Updated : 19 Nov 2021 10:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తోటి మహిళకు అసభ్యకరమైన సందేశాలు పంపిన నేపథ్యంలో ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథి టిమ్‌పైన్‌ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. 2017లో ఓ మహిళకు అతడు అసభ్యకర రీతిలో తన ఫొటోతో సహా పలు మెసేజ్‌లు పంపాడని ఇటీవల క్రికెట్‌ ఆస్ట్రేలియా చేపట్టిన విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే తాను ఆసీస్‌ టెస్టు కెప్టెన్‌గా ఉండేందుకు అనర్హుడినని పేర్కొంటూ శుక్రవారం మీడియా ముందుకు వచ్చాడు. ఇది కష్టతరమైన నిర్ణయమే అయినా.. తనకూ, తన కుటుంబంతోపాటు ఆస్ట్రేలియా క్రికెట్‌కు మంచిదని తెలిపాడు. కాగా, 2018లో అప్పటి సారథి స్టీవ్‌స్మిత్‌ బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని నిషేధానికి గురైన విపత్కర పరిస్థితుల్లో పైన్‌ ఆసీస్‌ టెస్టు పగ్గాలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే మూడేళ్లు కెప్టెన్‌గా కొనసాగి చివరికి ఇలా రాజీనామా చేశాడు. అయితే వచ్చేనెల 8 నుంచి ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా టీమ్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకమైన యాషెస్‌ సిరీస్‌ ఆడనుంది. ఈ మెగా టోర్నీకి ముందు పైన్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఆ జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని