T20 World Cup: న్యూజిలాండ్‌ గన్‌ తీసుకుంది కానీ.. బుల్లెట్లు పేల్చలేదు: మెక్‌కలమ్‌

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ ఓటమిపాలవ్వడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ స్పందించాడు. కివీస్‌ గన్‌ తీసుకుంది కానీ, బుల్లెట్లు పేల్చలేదని వ్యాఖ్యానించాడు...

Published : 16 Nov 2021 15:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ ఓటమిపాలవ్వడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ స్పందించాడు. కివీస్‌ గన్‌ తీసుకుంది కానీ.. బుల్లెట్లు పేల్చలేదని వ్యాఖ్యానించాడు. ఆ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నా సరైన ప్రదర్శన చేయలేకపోయారని పేర్కొన్నాడు. విలియమ్సన్‌ టీమ్‌ మంచి అవకాశాన్ని చేజార్చుకుందని చెప్పాడు. తుదిపోరులో కాస్త తడబడ్డారన్నాడు.

‘నేను మార్టిన్‌ గప్తిల్‌ నుంచి మరింత మంచి ఇన్నింగ్స్‌ ఆశించాను. అతడు 35 బంతుల్లో 28 పరుగులే చేశాడు. ఆ పద్ధతి అస్సలు బాగోలేదు. అయితే, అంతకుముందు 15 బంతుల్లో 16 పరుగులు చేశాడు. తర్వాతి 20 బంతుల్లో 12 పరుగులే చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితుల్లోనే దూకుడుగా ఆడాలి. అయితే, అక్కడే న్యూజిలాండ్‌ వెనుకబడిపోయింది. కీలక సమయంలో పరుగులు చేయలేకపోయింది’ అని మెక్‌కలమ్‌ తన అభిప్రాయం వెల్లడించాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో మిగతా బ్యాట్స్‌మెన్‌ పెద్దగా స్కోర్లు సాధించకపోయినా కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (85; 48 బంతుల్లో 10x4, 3x6) రెచ్చిపోయాడు. చివర్లో మరింత ధాటిగా ఆడే క్రమంలో హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (53; 38 బంతుల్లో 4x4, 3x6), మిచెల్‌ మార్ష్‌ (77 నాటౌట్‌; 50 బంతుల్లో 6x4, 4x6) దంచికొట్టడంతో ఆ జట్టు 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని