Daniil Medvedev: శ్రీమతికి ప్రేమతో... మెద్వెదేవ్‌ కానుక

యూఎస్‌ ఓపెన్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించి దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌కు షాకిచ్చిన ప్రపంచ రెండో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ ఆదివారం తన సతీమణికి అదిరిపోయే బహుమతి ఇచ్చాడు...

Updated : 13 Sep 2021 18:14 IST

సతీమణిపై ప్రేమ చాటుకున్న యువ సంచలనం

ఇంటర్నెట్‌డెస్క్‌: యూఎస్‌ ఓపెన్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించి దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌కు షాకిచ్చిన ప్రపంచ రెండో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ ఆదివారం తన సతీమణికి అదిరిపోయే బహుమతి ఇచ్చాడు. జకోవిచ్‌తో తలపడిన తుదిపోరులో డానిల్‌ 6-4, 6-4, 6-4 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే రోజు అతడికి మూడో వివాహ వార్షికోత్సవం కూడా. అలా వివాహ వార్షికోత్సవం రోజున యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ కొట్టి సతీమణికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ అందుకునేటప్పుడు ఈ రష్యా ఆటగాడు తన విజయంలో సతీమణి డారియా సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయని తెలిపాడు. ఆమెను ఎల్లప్పుడూ ప్రేమిస్తుంటానని అన్నాడు. కాగా, అక్కడే ఉంటూ ఈ మాటలు విన్న డారియా భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

‘నా భార్య డారియా ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ నాపై నమ్మకంతో ఉంటుంది. నేను టాప్‌ 10లో ఉంటానని అంటుండేది. ఒకవేళ నేను ఏదీ సాధించలేనని ఆమె చెబితే అందులో ఏదో లోపం ఉందని అర్థం. అలా తను నాకు పూర్తి మద్దతు ఇస్తుంది. తనంటే నాకెంతో ఇష్టం. డారియాతో ఉండాలంటే మరీ మరీ ఇష్టం. ఇంతకుమంచి నేనేమీ చెప్పలేను. ఈ టోర్నీ జరుగుతున్నంత కాలం ఆమెకు ఏ బహుమతి ఇవ్వాలనేదాని గురించి అస్సలు ఆలోచించలేదు. నేను ఫైనల్‌కు చేరాక.. ఒకవేళ ఇక్కడ ఓడితే ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నా. ఈ విజయంతో బహుమతి ఇచ్చా. మరోవైపు నాకు వేరే సమయం కూడా లేకపోయింది. ఇది నాకు తప్పుక గెలవాల్సిన మ్యాచ్‌గా అనిపించింది. ఐ లవ్యూ దారియా, థాంక్స్‌ ఎలాట్‌’ అంటూ మెద్వెదేవ్‌ తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.

ఇక ఈ తుదిపోరులో గెలిచాక మెద్వెదేవ్‌ విచిత్రంగా సంబరాలు చేసుకున్నాడు. ఒంట్లో ఉన్న శక్తినంతా కోల్పోయి ఉన్నట్టుండి కిందపడిపోయినట్లు నటించాడు. అయితే, అది కూడా ఒక సెలబ్రేషన్‌ అని, దాన్ని ఫుట్‌బాల్‌లో చేసుకుంటారని తెలిపాడు. ఇదివరకు వింబుల్డన్‌ గెలిస్తే ఇలా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకున్నట్లు అతనన్నాడు. అప్పుడు కుదరకపోవడంతో ఇప్పుడిలా చేసినట్లు వివరించాడు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని