IPL 2021: లోపాలు సరిదిద్దుకున్నాం.. జడేజా అలా ఆడితే ఏం చేయగలం?

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఆదివారం సాయంత్రం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడిన సందర్భంగా ఉత్కంఠకర పరిస్థితుల్లో చెన్నై చివరి బంతికి విజయం సాధించింది...

Updated : 27 Sep 2021 09:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఆదివారం సాయంత్రం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠ పరిస్థితుల్లో చెన్నై చివరి బంతికి విజయం సాధించింది. దీపక్‌ చాహర్‌ సింగిల్‌ తీసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో చెన్నై పాయింట్ల పట్టికలో మళ్లీ టాప్‌లోకి దూసుకెళ్లి 16 పాయింట్లతో కొనసాగుతోంది. దిల్లీ తర్వాత ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ మాట్లాడుతూ ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.

‘ఇది చాలా అద్భుతమైన విజయం. క్రికెట్‌లో కొన్నిసార్లు బాగా ఆడి మ్యాచ్‌ను కోల్పోతాం. మరికొన్ని సార్లు బాగా ఆడకపోయినా గెలుపొందుతాం. ఇలాంటప్పుడు ఇంకాస్త ఎక్కువ ఆనందం ఉంటుంది. ఈ రోజు మాత్రం చాలా అద్భుతమైన మ్యాచ్‌ జరిగింది. కోల్‌కతా కూడా బాగా ఆడటంతో అభిమానులు మంచి ఆటను ఆస్వాదించారు. ఇక ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. అబుదాబిలో ఉక్కపోత తీవ్రత ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఫాస్ట్‌ బౌలర్లకు అంత తేలికకాదు. అందుకే వారితో ఒకటి, రెండు ఓవర్ల స్పెల్స్‌ వేయించాం. అయితే, ఈ వికెట్‌పై 170 పరుగులనేవి మంచి స్కోరే. ఈ విజయానికి కోల్‌కతా జట్టు కూడా అర్హమైనదే. ఇక మా జట్టులో లోపాలను సరిదిద్దుకున్నామని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. ఇలా వరుస విజయాలు సాధించడం బాగుంది’ అని ధోనీ వివరించాడు.

జడేజా అలా ఆడితే ఏం చేయగలం: మోర్గాన్‌

‘రెండు జట్లూ అద్భుతంగా ఆడినా చెన్నై విజయం సాధించింది. అయితే, ఈ రోజు మా ఆటలో ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. మావాళ్లందరూ గెలిచేందుకు చాలా కష్టపడ్డారు. దురదృష్టం కొద్దీ ఓటమిపాలయ్యాం. రెండో దశలో మా జట్టు సానుకూలంగా ఆడుతోంది. ఈరోజు ఆటలో అలాంటి పరిణామాలనే ఎంచుకొని తర్వాతి మ్యాచ్‌ల్లో రాణించేందుకు ప్రయత్నిస్తాం. ఇక సునీల్‌ నరైన్‌ ఏ జట్టు మీదైనా రాణించడానికి సిద్ధంగా ఉంటాడు. అతడి కన్నా మెరుగైన ఆటగాడు దొరకడు. మరోవైపు ఈ టోర్నీలో చాలా మంది నైపుణ్యమున్న ఆటగాళ్లు ఉన్నారు. అందులో కొందరు భారత యువ ఆటగాళ్లు ఉన్నారు. వారిలాగే ఆడితే టీమ్‌ఇండియాకు ప్రాతినధ్యం వహించే అవకాశం ఉంది. ఇక చెన్నై జట్టులోని రవీంద్ర జడేజా.. ఇంగ్లాండ్‌ ఆటగాడు సామ్‌కరన్‌లా ఆడితే ఏమీ చేయలేం. మా స్పిన్నర్లు కూడా మంచి ప్రదర్శన చేశారు’ అని మోర్గాన్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు