Rohit - Rahul: రోహిత్‌-రాహుల్‌కు బ్యాకప్‌ ఆటగాడిని చూడాలి: డీకే

టీమ్‌ఇండియా బ్యాటర్లు రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌ ఓపెనర్లుగా అదరగొడుతున్నారని.. అయితే, వారికి ఒక బ్యాకప్ ఆటగాడిని చూడాలని సీనియర్‌ వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు...

Published : 21 Nov 2021 01:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా బ్యాటర్లు రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌ ఓపెనర్లుగా అదరగొడుతున్నారని.. అయితే, వారికి ఒక బ్యాకప్ ఆటగాడిని చూడాలని సీనియర్‌ వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. తాజాగా అతడు ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరిలో ఎవరికైనా గాయాలైతే బ్యాకప్‌ ఆటగాడు ఉండాలని అభిప్రాయపడ్డాడు.

‘నాకో సందేహం ఉంది. వాళ్లిద్దరిలో ఎవరికైనా గాయమైతే ప్రత్యామ్నాయంగా ఉండే మూడో ఓపెనర్‌ ఎవరు? జట్టు యాజమాన్యం అలాంటి ఆటగాడిని కనుగొనాల్సి ఉంది. జట్టులో ముగ్గురు ఓపెనర్లకు మించిన అవసరం రాదనుకుంటా. అదొక్కటే నా అనుమానం. ఈ విషయంపై జట్టు యాజమాన్యం దృష్టిసారించాలి. మూడో ఓపెనర్‌గా సరైన బ్యాట్స్‌మన్‌ను కనుగొనాలి’ అని కార్తీక్‌ అన్నాడు.

అలాగే టీమ్‌ఇండియాలో ఇప్పుడు చాలా మంది బ్యాటర్లు ఉన్నారని, అందులో బాగా ఆడే కొందరి పేర్లు కూడా డీకే సూచించాడు. లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్లలో ఇషాన్‌ కిషన్‌, శిఖర్‌ ధావన్‌, వెంకటేశ్‌ అయ్యర్ ఉన్నారని.. రైట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మన్లలో రుతురాజ్‌ గైక్వాడ్‌ ఉన్నాడని గుర్తుచేశాడు. ఓపెనర్లుగా రోహిత్‌-రాహుల్‌ ఇప్పటికే నిరూపించుకున్నారని, ఇక కివీస్‌తో ఆదివారం తలపడే మూడో టీ20లో ఒకరు తప్పుకొని మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలని కోరాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ కల్లా సరైన మూడో ఓపెనర్‌ను తయారు చేయాలని, అతడు వీరిద్దరితో సమానంగా పరుగులు చేసేలా ఉండాలని డీకే చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని